Multibagger Share: స్టాక్ మార్కెట్ దిగ్గజం రాధాకృష్ణ దమానీ పెట్టుబడి పెట్టిన ఓ స్టాక్ ఏడాది కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్నులు అందించింది. అస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ షేరు గతేడాది నుంచి పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఎదురీదుతున్న సమయంలో ఈ షేరు మాత్రం తగ్గేదే లే! అన్నట్టుగా సాగింది. ఒక్కో షేరు ధర రూ.157 నుంచి రూ.322కు ఎగబాకడంతో ఇన్వెస్టర్ల సంపద రెట్టింపు అయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఎకానమీ మందగనమంలో ఉన్నప్పటికీ గత ఆరు నెలలుగా మెరుగైన రిటర్ను ఇవ్వడం గమనార్హం.
అస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ షేరు ధర బుధవారం 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. రూ.322కు చేరుకుంది. ఇంట్రాడేలో 2.50 శాతం పెరిగింది. అయితే ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడే కనిష్ఠమైన రూ.316ను తాకింది. కేవలం నెల రోజుల్లోనే ఈ షేరు రూ.245 నుంచి రూ.322కు పెరిగింది. 30 శాతం రాబడి ఇచ్చింది. ఇక చివరి ఆరు నెలల్లో రూ.175 నుంచి రూ.322కు ఎగిసింది. 80 శాతం ర్యాలీ చేసింది. అలాగే ఏడాది వ్యవధిలో వంద శాతం పెరిగి రూ.155 నుంచి రూ.322కు ఎగిసింది.
2022, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో అస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్‌లో రాధాకృష్ణ దమానీకి 8,96,387 షేర్లు ఉన్నాయి. కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో ఇది 1.03 శాతం. 2022, మార్చి త్రైమాసికంలోనూ ఆయన షేర్ల సంఖ్య అలాగే ఉంది. అంటే కొన్నేళ్లుగా ఆయన ఈ కంపెనీపై ఎంతగానో విశ్వాసం ఉంచారు.
నేటి మార్కెట్
Stock Market Opening Bell 24 August 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ఓపెనయ్యాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్ల లాభంతో 17,608 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 93 పాయింట్ల లాభంతో 59,124 వద్ద కొనసాగుతున్నాయి.
Also Read: డ్రీమ్‌ఫోక్స్ ఐపీవో మొదలు! GMP అదిరింది - సబ్‌స్క్రైబ్ చేసేముందు ఇవి తెలుసుకోండి!
Also Read: ఎన్డీటీవీలో 29.18% వాటా కొన్న అదానీ గ్రూప్! మరో 26% వాటా కోసం ఓపెన్ ఆఫర్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.