Adani Group Acquire NDTV: మీడియా రంగంలో నేడు కీలక మార్పు చోటు చేసుకుంది. అదానీ గ్రూప్‌నకు చెందిన సబ్సిడరీ సంస్థ న్యూదిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (NDTV)లో 28.18 శాతం వాటా సొంతం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. సెబీ నిబంధనలు అనుసరించి ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించింది.
పరోక్ష విధానంలో ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా కొనుగోలు చేశామని అదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL)కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ (AMNL)లో భాగమైన విశ్వప్రధాన కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా వాటా తీసుకున్నామని వివరించింది. ఆఆర్‌పీఆర్‌లో 99.5 శాతం వాటా కొనుగోలు కోసం వీసీపీఎల్ వారంట్స్‌ను ఉపయోగించింది. దాంతో ఆర్‌ఆర్‌పీఆర్‌ను వీసీపీఎల్ నియంత్రించగలదు.
ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. కాగా సెబీ నిబంధనల ప్రకారం ఎన్‌డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్, ఏఎంఎన్‌ఎల్, ఏఈఎల్ కలిసి ఓపెన్ ఆఫర్ ప్రకటించాయి.
'ఎన్డీటీవీలో వాటా కొనుగోలు చేయడం ఏఎంఎన్‌ఎల్ ప్రయాణంలో సరికొత్త మైలురాయి. వివిధ వేదికల ద్వారా కొత్తతరం మీడియాకు బాటలు వేయడం మా లక్ష్యం. సరైన సమాచారం, విజ్ఞానం అందించి భారత పౌరులు, వినియోగదారులు, భారత్‌పై ఆసక్తిగల వారికి సాధికారత కల్పించాలని అనుకుంటున్నాం. ఎన్డీటీవీకి వార్తా ప్రపంచంలో మంచి మార్కెట్ ఉంది. వివిధ ప్రాంతాలకు అన్ని రకాల వార్తలు చేరవేస్తోంది. మా దార్శనికతను ప్రచారం చేసేందుకు ఎన్డీటీవీ సరైన బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ మాధ్యమం' అని ఏఎంజీ మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ సీఈవో సంజయ్ పుగాలియా అన్నారు.
ప్రస్తుతం ఎన్డీటీవీ 24x7, ఎన్డీటీవీ ఇండియా, ఎన్డీటీవీ ప్రాఫిట్ వార్తా ఛానళ్లను ఎన్డీటీవీ నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ మీడియాలోనూ మంచి ఉనికి ఉంది. వెబ్‌సైట్‌ను ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.