AP Highcourt :  అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము సుప్రీంకోర్టులో  రివ్యూ పిటిషన్ వేసే యోచనలో ఉన్నామని ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ కొనసాగింది.   త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన సమయంలో  కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం  స్టేటస్ రిపోర్టు ను కోర్టుకు దాఖలు చేసింది. అయితే రాజధానిలో ఎటువంటి పనులు చేపట్టలేదని, పురోగతి కూడా లేదని.. రైతుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు లో ఎస్ఎల్పీ  వేశారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పులో రైతుల పరిహారానికి సంబంధించి తిరస్కరించడంతో.. దానిపై మాత్రమే ఎస్ఎల్పీ వేశామని, హైకోర్టు తీర్పును మాత్రం వ్యతిరేకించలేదని లాయర్ మురళీధర్ తెలిపారు.


సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న ఏజీ 


ప్రభుత్వం నుంచి ఎస్ఎల్పీ వేశారా? అని.. ఏజీని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్మించింది. తీర్పును సమీక్షించాలని రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయబోతున్నామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్లో ఉన్న సమయంలో.. హైకోర్టులో విచారణ సబబా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పులో తాము కోరిన అంశాలు తిరస్కరించడంతో.. వాటిపై మాత్రమే సుప్రీం కోర్టుకు వెళ్లామని రైతుల తరఫు లాయర్ మురళీధర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో తీర్పును అమలు చేయకపోవడంతోనే.. హైకోర్టులోనే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేశామని రైతుల తరపు న్యాయవాదులు చెప్పారు. 


అక్టోబర్ 17 వ తేదీకి కేసు విచారణ వాయిదా 


ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ నివేదికపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. రాజధాని కేసులపై తిరిగి విచారణ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది మార్చి ఏపీ హైకోర్టు.. అమరావతి విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రైతులతో చేసుకున్న ఒప్పందాల కారణంగా.. రాజధాని మార్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాజధానిని నిర్మించాలని.. ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం అనుకున్న విధంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు.  బ్యాంకులు రుణాలివ్వడం లేదని చెబుతోంది. 


మార్చిలో తీర్పు వచ్చినా ఇప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్తామనే చెబుతున్న ఏపీ ప్రభుత్వం


హైకోర్టు తీర్పు వచ్చినప్పటి నుండి తాము సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెబుతోంది కానీ ఇంత వరకూ ఎలాంటి రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. అయితే రైతులే ముందుగా.. ప్రభుత్వ తీరు వల్ల.. ధిక్కరణ తీరు వల్ల కొన్ని వందల కోట్ల సంపద నాశనం అవుతోందని వారు ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ఈ విషయాలనే ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.   ఏపీ రాజధానికి నష్టపరిహారం తీసుకోకుండా భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పలు హామీలతో అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారం చేయాల్సిన పనులన్నింటినీ చేయలేదు.  ప్రభుత్వం మాత్రం తాము మూడు రాజధానులకే కట్టుబడ్డమని చెబుతూ పనులు మాత్రం చేయడం లేదు.  . ఇలాంటి పరిణామాలతో రైతులు విసుగు చెంది.. పనులు చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.