Uddhav Thackeray Vs Shinde:
గురువారం విచారణ..
శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించాయి ఇరు వర్గాలు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న విచారణ...ఇప్పుడు మొదలు కానుంది. ఈ విచారణ చేపట్టేందుకు 5గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. ఈ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గాలు చెప్పటంతో పాటు, శివసేన
పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. అయితే...విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం...పరిధిలో ఉన్న ఈ అంశం..ఇప్పుడు 5-గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ అయింది. ఉద్ధవ్ క్యాంప్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ విజ్ఞప్తి మేరకు...సుప్రీం కోర్టు ఈ విచారణ చేపట్టనుంది.
మాటల యుద్ధం..
మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. శివసేనలో ఎవరికి మెజార్టీ ఉందో డాక్యుమెంట్ రూపంలో ఆధారాలు సమర్పించాలని ఏక్‌నాథ్ శిందేతో పాటు ఉద్ధవ్ ఠాక్రేను కూడా అడిగింది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని
విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. "ఇది మహారాష్ట్ర ప్రజల్ని షాక్‌కు గురి చేసింది.
బాలాసాహెబ్ ఠాక్రే 56 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు. ఇలాంటి పార్టీపై ఈసీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కేంద్రం మా పార్టీని నాశనం చేయాలని చూస్తోంది. శివసేనకు ఒకే ఒక లీడర్ ఉన్నారు. అది ఉద్దవ్ ఠాక్రే మాత్రమే" అని స్ఫష్టం చేశారు సంజయ్ రౌత్. ఇదే అంశమై గతంలో ఏక్‌నాథ్ శిందే కూడా స్పందించారు. "ఎన్నికల సంఘం చెప్పినట్టుగా నడుచుకుంటాం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆధారాలు సమర్పిస్తాం. శివసేన మాదే. మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది" అని వెల్లడించారు.
Also Read: ఎన్టీఆర్ చెప్పిన ఫార్ములాలో తెలంగాణ పాలిటిక్స్
Also Read: Sonali Phogat Death: భాజపా నేత సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మృతి