బాయ్‌కాట్‌... బాయ్‌కాట్‌... బాయ్‌కాట్‌... హిందీలో ఇప్పుడు ఏ సినిమా వచ్చినా బాయ్‌కాట్‌ అంటున్నారు కొందరు. బాలీవుడ్‌లో ఇది నయా ట్రెండ్. హిందీ హీరోలకు మాత్రమే కాదు... తెలుగు వాడు, 'లైగర్' (Liger Movie) సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను పరిచయం అవుతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు కూడా తగిలింది. 


''మనం కరెక్ట్ ఉన్నప్పుడు... మన ధర్మం మనం చేసినప్పుడు... ఎవరి మాట వినేది లేదు. కొట్లాడుదాం'' అని విజయ్ దేవరకొండ ఆగస్టు 20న ట్వీట్ చేశారు. బాయ్‌కాట్‌ ట్రెండ్ గురించి ఆయన ఆ ట్వీట్ చేశారని అందరూ భావించారు. అయితే... ఇప్పుడు నేరుగా బాయ్‌కాట్‌ గురించి స్పందించారు.
 
అమ్మ ఆశీర్వాదం... ప్రజల ప్రేమ...
''అమ్మ ఆశీర్వాదం ఉంది. ప్రజల ప్రేమ ఉంది. భగవంతుడి కృప ఉంది. మన లోపల కసి ఉంది. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన తాజా స్పందన ఇది. తాము ఎంతో కష్టపడి, ప్రేమతో 'లైగర్' సినిమా చేశామని... తప్పకుండా ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తారని విజయ్ దేవరకొండ ధీమా వ్యక్తం చేశారు.
 
ఎన్నో కష్టాలు దాటి ఇక్కడికి వచ్చా!
బాయ్‌కాట్‌ ట్రెండ్ మీద స్పందించిన విజయ్ దేవరకొండ... తాను ఈ స్థాయికి రావడం వెనుక పడిన స్ట్రగుల్స్, కష్టాలను గుర్తు చేశారు. ''నేను మొదటి సినిమా చేసినప్పుడు మాకు నిర్మాత దొరకలేదు. అందుకని, ఫ్రీగా చేశా. ప్రొడక్షన్ ఖర్చుల కోసం డబ్బులు పోగు చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇండస్ట్రీలో నేను ఎవరో కూడా తెలియదు. నా మూడో సినిమా 'అర్జున్ రెడ్డి' విడుదలకు ముందు చాలా నిరసనలు చూశాం. అయితే, ఆ సినిమా హిట్ అయ్యింది. ప్రేక్షకులకు నేను తెలిశా. ఆ తర్వాత నేను నటించిన 'టాక్సీవాలా' థియేటర్లలో విడుదల కావడానికి ముందు ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. ఇప్పుడు నేను కొంత సాధించాను. 'లైగర్'  విషయంలో భయపడేది లేదు'' అని విజయ దేవరకొండ పేర్కొన్నారు. 


Also Read : విజయ్ దేవరకొండకు రింగ్ తొడిగింది, హగ్ చేసుకుని ఏడ్చింది - రౌడీ బాయ్‌కు దిష్టి తగలకూడదని


'లైగర్'ను ఎందుకు బాయ్‌కాట్‌ చేస్తున్నారంటే?
'లైగర్'ను బాయ్‌కాట్‌ చేయడానికి కరణ్ జోహార్ నిర్మాతలలో ఒకరు కావడం ఒక కారణం అయితే... అనన్యా పాండే  కథానాయిక కావడం మరో కారణం. ఆ రెండిటి కంటే ముఖ్యంగా 'లాల్ సింగ్ చడ్డా'ను బాయ్‌కాట్‌ చేయడం గురించి విజయ్ దేవరకొండ స్పందిస్తూ... సినిమా వెనుక కార్మికుల కష్టాలను కూడా చూడాలని కోరడం మరొక కారణం. బాలీవుడ్ జనాలు బాయ్‌కాట్‌ అంటుంటే.... 'ఐ సపోర్ట్ లైగర్' అంటూ ఉత్తరాదిలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, దక్షిణాదిలో అభిమానులు ట్రెండ్ చేశారు.


అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించిన ఈ సినిమాలో మైక్ టైసన్ (Mike Tyson), రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. 



Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి