నచ్చిన ఆహారం కనిపిస్తే ఆగలేం, లాగించేస్తాం. ఇంకేముంది ఫలితంగా కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. దాన్ని తగ్గించుకోడానికి నానా తంటాలు పడాలి. శరీరంలో కొవ్వు కొంత మంచి చేస్తే, ఎక్కువగా చెడే చేస్తుంది. కొవ్వు ఎక్కువ అయితే అధిక బరువు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. అదే విధంగా మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని వ్యర్థాలని బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అందుకే శరీరంలో మంచి కొవ్వు ఉండొచ్చు కానీ, చెడు కొలెస్ట్రాల్ మాత్రం ఉండకూడదు . దాన్ని కరిగించుకోడానికి వ్యాయామం, డైట్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంది. ఇక డబ్బున్న వాళ్ళు అయితే విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ ద్వారా కొవ్వు తీయించుకుంటారు.
మన నోరు అదుపులో ఉండకపోవడం వల్ల జంక్ ఫుడ్, పానీయాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి, మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త జీవనశైలి వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు భారీగా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదకరమైన రోగాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే మీ శరీరంలోని కొవ్వుని కరిగించుకోడానికి సహజమైన పద్ధతిని పాటించాలి. ఈ ఆధునిక కాలంలో కొవ్వు కరిగించుకునేందుకు వ్యాయామమే కాదు ఆహారపు అలవాట్లలో కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాలి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.
జంక్ ఫుడ్ నో
చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందులో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని పెంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే వీలైనంత వరకు వాటి జోలికి ఎక్కువగా వెళ్లకపోవడమే మంచిది.
ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి
ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాని పెంచేందుకు సహాయపడుతుంది. దాని వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి పని చేస్తుంది. బ్రకోలి, బీన్స్, అవకాడో, కిడ్నీ బీన్స్, యాపిల్ వంటి వాటిలో ఈ ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది.
క్రమం తప్పని వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం చాలా మంచి పని. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు క్రమం తప్పని వ్యాయామం మొత్తం ఆరోగ్యానికే మంచిది.
మద్యపానం తగ్గించాలి
మితంగా మద్యం సేవించడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపరుస్తుంది. అయితే ఎక్కువగా మందు తాగడం వల్ల గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మద్యపానం చేయకపోవడం ఉత్తమం.
Also read: రొయ్యల ఫ్రైడ్ రైస్, ఇంట్లోనే ఇట్టే చేసేయచ్చు
Also read: హ్యాపీ మూడ్ కావాలా? అయితే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి