Dreamfolks Services IPO: బుల్ మార్కెట్ మొదలవ్వడంతో ఐపీవోల జోరు పెరిగింది. ఇప్పటికే సిర్మా టెక్నాలజీ ఇష్యూకు మంచి స్పందన లభించింది. త్వరలోనే మార్కెట్లో నమోదవ్వనుంది. తాజాగా విమానాశ్రయ సేవల కంపెనీ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ (Dreamfolks Services Ltd) పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఆగస్టు 24 నుంచి ఐపీవో మొదలవుతుంది. సబ్‌స్క్రైబ్ చేసుకొనేందుకు ఆగస్టు 26 చివరి తేదీ. షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.308-326గా నిర్ణయించారు.
యాంకర్ ఇన్వెస్టర్లకు 7.76 కోట్ల షేర్లు
పబ్లిక్ ఇష్యూకు ముందు డ్రీమ్‌ఫోక్స్ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.253 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరుకు రూ.326 చొప్పున 7.76 కోట్ల షేర్లను వారికి కేటాయించింది. ఇక ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. పీటర్ కల్లాట్, దినేశ్ నాగ్‌పాల్, ముకేశ్ యాదవ్ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు. పోస్ట్ ఆఫర్ పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 33 శాతం ప్రజలకు కేటాయించారు.
గ్రే మార్కెట్ ప్రీమియం
మార్కెట్ వర్గాల ప్రకారం డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ షేర్లు రూ.62 ప్రీమియంతో (GMP) గ్రే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2022, సెప్టెంబర్ 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదవుతాయని తెలిసింది.
బ్రోకింగ్ కంపెనీల వివరణ
'కొన్ని అంశాల ఆధారంగా ఈ ఐపీవోను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సూచిస్తున్నాం. కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు. లాభాల్లో ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రయాణ రంగంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కంపెనీలో ఎలాంటి ప్రైవేట్ ఈక్విటీ లేదు. కంపెనీ విలువ కాస్త అధికంగానే అనిపిస్తున్నా ఈ రంగంలో ఐపీవోకు వస్తున్న తొలి భారతీయ కంపెనీ ఇదే కావడం గమనార్హం. చైనా, బ్రిటన్‌లో మాత్రమే ఇలాంటి కంపెనీలు ఐపీవోకు వెళ్లాయి' అని జైనమ్ బ్రోకింగ్ తెలిపింది.
డ్రీమ్‌ఫోక్స్ సేవలు
విమానాశ్రయాల్లో ప్రయాణికులు మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు డ్రీమ్‌ఫోక్స్ సాయపడుతుంది. టెక్నాలజీ ద్వారా లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, స్పా, ఎయిర్ పోర్టుకు వచ్చిన వారికి మీట్ అండ్ అసిస్ట్, హోటల్‌కు తీసుకెళ్లడం, పడక గదులు, బ్యాగుల తరలింపు వంటి సేవలు అందిస్తుంది.
మార్కెట్ సెంటిమెంటును బట్టి లిస్టింగ్
'డ్రీమ్ ఫోక్స్ వ్యాపార విధానం బాగుంటుంది. షేర్ల ధరలు, కంపెనీ విలువ అధికంగా ఉన్నట్టు అనిపిస్తోంది. 104.82x పీఈతో షేర్లు విక్రయిస్తున్నారు. 32 శాతం వాటాను ఓఎఫ్‌ఎస్ ద్వారా కేటాయిస్తున్నారు. రిటైల్ కోటా, మార్కెట్ సెంటిమెంటును బట్టి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. బహుశా సానుకూలంగానే నమోదవ్వొచ్చు' అని అన్‌లిస్టెట్ ఎరీనా సహ వ్యవస్థాపకుడు అభయ్ దోషీ అంటున్నారు.