Syrma SGS Technologies IPO GMP: సిర్మా సీజీఎస్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు మంచి స్పందనే లభించింది. రూ.840 కోట్ల విలువతో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. నాలుగు రోజుల సబ్‌స్క్రిప్షన్‌ గురువారంతో ముగిసింది. మొత్తంగా 32.61 రెట్లు, రిటైల్‌ కోటాలో 5.53 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. గ్రే మార్కెట్‌ ప్రీమియం సైతం పెరుగుతుండటం గమనార్హం.


GMP ఎలా ఉందంటే?


గ్రే మార్కెట్లోనూ సిర్మా టెక్నాలజీస్‌ ఇష్యూకు మెరుగైన స్పందనే వస్తోంది. గురువారం ఒక్కో షేరుకు రూ.36 ప్రీమియం ఉండగా శుక్రవారం రూ.12 పెరిగి రూ.48కి చేరుకుంది. సాధారణంగా గ్రే మార్కెట్‌ ప్రీమియం (GMP) ఎక్కువగా ఉంటే లిస్టింగ్‌ రోజు అధిక ప్రీమియంతో షేర్లు నమోదవుతాయి. మొదట్లో సిర్మా జీఎంపీ రూ.20గా ఉండేది. ఇప్పుడది రూ.48కి పెరిగింది. ఏదేమైనా మార్కెట్‌ సెంటిమెంటును బట్టి లిస్టింగ్‌ గెయిన్స్‌ ఉంటాయి. సిర్మా షేరు ప్రైస్‌ బ్యాండ్‌ రూ.209- రూ.220గా ఉంది. గరిష్ఠ ధర ప్రకారం రూ.220+48 మొత్తంగా రూ.268కి షేర్లు నమోదయ్యే అవకాశం ఉంది.


ఆగస్టు 26న లిస్టింగ్‌


పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను మూలధన ఖర్చులు, ఆర్‌ అండ్‌ డీ, తయారీ కేంద్రాల విస్తరణకు సిర్మా ఉపయోగించనుంది. ఆగస్టు 23న ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ఉంటుంది. కేటాయింపు జరగని వారికి ఆగస్టు 24న డబ్బు రీఫండ్‌ చేయనుంది. ఆగస్టు 25న డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. ఆగస్టు 26న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలో షేర్లు నమోదు అవుతాయి.


కస్టమర్ల జాబితా పెద్దదే


ఎలక్ట్రానిక్‌ రీసెర్చ్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌లో సిర్మా టెక్నాలజీస్‌కు మంచి అనుభవం ఉంది. టీవీఎస్‌ మోటార్స్‌, ఏవో స్మిత్‌ ఇండియా, రాబర్ట్‌ బాష్‌ ఇంజినీరింగ్‌, యురేకా ఫోర్బ్స్‌, టాటా పవర్, టోటల్‌ పవర్‌ యూరప్‌ వంటి కంపెనీలు వీరికి కస్టమర్లు. హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడు, హరియాణా, జర్మనీలో ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు ఉన్నాయి.