Tata Technologies IPO: టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ ఐపీవోకు రానుంది. టాటా మోటార్స్‌ సబ్సిడరీ కంపెనీ టాటా టెక్నాలజీస్‌ను (Tata Technologies IPO) ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురావాలని యాజమాన్యం భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగేతే 18 ఏళ్ల తర్వాత ఆ గ్రూప్‌ నుంచి మళ్లీ లిస్టవున్న కంపెనీగా ఆవిర్భవిస్తుంది. 2017లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్‌.చంద్రశేఖరన్‌ నేతృత్వంలో ఐపీవోకు వస్తున్న తొలి కంపెనీగా రికార్డు సృష్టిస్తుంది.


ఈ మధ్య ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఎయిరోస్పేస్‌ ఇండస్ట్రీ సైతం పుంజుకుంది. ఈ రెండు రంగాలకు అవసరమైన సాంకేతికతను టాటా టెక్నాలజీస్‌ అభివృద్ధి చేస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీకి  క్లయింట్లు ఉన్నారు. ఐపీవో ప్రక్రియలో భాగంగా కంపెనీ విలువను నిర్ధారించేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ను నియమించుకుందని మనీకంట్రోల్‌ రిపోర్టు చేసింది. ఈ కంపెనీలో టాటా మోటార్స్‌కు 74 శాతానికి పైగా వాటా ఉంది.


ఆటో మోటివ్‌, ఎయిరోస్పేస్‌, ఇండస్ట్రియల్‌ మెషినరీ, ఇండస్ట్రియల్స్‌ వంటి రంగాలపై టాటా టెక్నాలజీస్‌ ఎక్కువగా దృష్టి పెడుతుంది. అటానమస్‌, కనెక్టెడ్‌, ఎలక్ట్రిఫికేషన్‌, షేర్డ్‌ మొబిలీటీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. కొత్తతరం వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు డిజిటల్‌, తయారీ రంగపై పెట్టుబడులు పెంచింది.


ప్రస్తుతం టాటా టెక్నాలజీస్‌లో 9,300కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, ఐరోపా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో క్లయింట్లు ఉన్నారు. కంపెనీకి 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలు, నాలుగు ఇంజినీరింగ్‌, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌, ఎడ్యుకేషన్‌, వాల్యూ యాడెడ్‌ రీసెల్లింగ్‌, ఐ ప్రొడక్టుల సేవలు అందిస్తోంది. 2022, మార్చి 31తో ముగిసిన కాలానికి టాటా టెక్నాలజీస్‌ రూ.3,529 కోట్లను ఆర్జించింది. నిర్వాహక లాభం రూ.645 కోట్లు, పన్నేతర లాభం రూ.437గా ఉన్నాయి.


ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. మార్కెట్‌ బుల్లిష్‌గా లేదు. ఇలాంటి సమయంలో టాటా టెక్నాలజీస్‌ ఐపీవోకు వచ్చిందంటే సాహసమే అని చెప్పాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో మంచి అనుభవం ఉండటం, వేగంగా వృద్ధి చెందుతుండటం ప్లస్‌ పాయింట్లు. కాగా టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ టాటా స్కై సైతం ఐపీవోకు వస్తుందని సమాచారం.


Also Read: గ్యాప్‌ అప్‌తో మొదలైనా బలహీనంగానే సూచీలు! 16 వేల పైనే నిఫ్టీ


Also Read: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! ఇన్‌ఫ్లేషన్‌ కాస్త తగ్గిందండోయ్‌!!