దేశంలో పెట్రోల్ బాదుడు మళ్లీ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే మార్చి 7న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పెట్రో బాదుడు మొదలవుతుందని అధికారులు చెప్పినట్లు న్యూస్ ఏజెన్సీ రైటర్స్ పేర్కొంది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర భారీగా పెరుగుతోంది. అయినప్పటికీ భారత్‌లో ఇప్పటివరకు పెట్రోల్ ధరలు పెంచలేదు.
గతేడాది దీపావళి సందర్భంగా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 మేర సెంట్రల్ ఎక్సైస్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కారణంగానే ఇలా చేసినట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
ముడి చమురు ధరలు పైపైకి
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుంచి ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర 116 డాలర్లకు చేరింది. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 10-12 పెంచాలని చమురు సంస్థలు.. కేంద్రానికి వివరించినట్లు సమాచారం.
బ్యారెల్ క్రూడ్ ధర 120 డాలర్లకు
ముడి చమురు సరఫరాపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది. దీంతో నెల రోజుల క్రితం 75 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఇప్పుడు 116 డాలర్లకు పెరిగింది. ఏడేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి పెరుగుదల. రష్యాపై ఆంక్షలు మరింతగా విధిస్తారని విశ్లేషకులు అంటున్నారు. దీంతో సరఫరా, గిరాకీ మధ్య సమతుల్యం దెబ్బతినడంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Gun Fire At BSF Camp: బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పులు - ఐదుగురు జవాన్లు మృతి, ఆరుగురికి గాయాలు
Also Read: Delhi High Court: ఆ కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు లేదు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు