Daughter In Law Right Of Residence: ప్రతి ఇంట్లో ఏదో ఓ విషయంపై గొడవలు జరుగుతుంటాయి. అది భార్యాభర్తల మధ్య గొడవ గానీ, తల్లితండ్రులు, పిల్లల మధ్య చిన్న చిన్న విషయాలలో విభేదాలు రావడం సహజం. అయితే అత్తాకోడళ్ల మధ్య తలెత్తే గొడవలు మాత్రం భిన్నంగా ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో కోడళ్లకు అత్తగారింట్లో వేధింపులు ఎదురువుతుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్బాలలో కోడలి వల్ల అత్తవారింట్లో గొడవలు జరుగుతాయి. ఇలాంటి ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు  (Delhi High Court) కీలక తీర్పు వెలువరించింది. అత్తామామలకు ప్రశాంతత లేకుండా చేస్తున్న కోడలికి అత్తవారింట్లో ఉండే హక్కు ఉండదని స్పష్టం చేసింది. కోడలి వల్ల మిగిలిన కుటుంబ సభ్యులకు ఇంట్లో ప్రశాంతత కరువవుతుందని, ముఖ్యంగా పెద్ద వయసువారైన అత్తామామలకు ఇది ఇబ్బందికరమని  ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) అభిప్రాయపడింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్వాగతించింది. 


అసలేం జరిగిందంటే..
ఓ కోడలికి తన అత్తమామల ఇంట్లో నివసించే హక్కును నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. అత్తామామలకు అకారణంగా గొడవపడే కోడలికి ఆ ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు లేదని, గృహహింస చట్టంలో ఉందని న్యాయస్థానం పేర్కొంది. తమ కూతురుకు దిగువ కోర్టులో అన్యాయం జరిగిదంటూ మహిళ, ఆమె తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేశారు. కోడలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ యోగేష్ ఖన్నా విచారణ చేపట్టారు. ఇంటి యజమాని ఆ కోడల్ని బటయకు పంపేందుకు అధికారం ఉంటుందని, అందుకు ఆమె ప్రవర్తనే కారణమని చెప్పారు. 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
తాము నివసించే ఇంటి నుంచి కోడల్ని బటయకు పంపించినా, ఆమె ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అత్తవారింటిపై ఉందని జస్టిస్ యోగేష్ ఖన్నా పేర్కొన్నారు. పిటిషనర్ వివాహ బంధం కొనసాగినంత కాలం ఆమెకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో అత్తామామలు సీనియర్ సిటిజన్స్ అని, వారు ప్రశాంతంగా జీవించడానికి అర్హులని, అందుకు కుమారుడు, కోడలి వైవాహిక బంధ సమస్యలు అడ్డుకాకూడదని చెప్పారు. గృహ హింస చట్టం (Domestic Violence Act)లోని సెక్షన్ 19(1)(AF) ప్రకారం మహిళల రక్షణ కోసం పిటిషనర్‌కు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాలి. ప్రస్తుతానికి కుమారుడు, కోడలు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే తమ ఆస్తిపై హక్కు కోసం ఎలాంటి క్లెయిన్ చేయకూడదని పిటిషనర్ భర్త సైతం ఫిర్యాదు చేశారు. 


పిటిషనర్ అప్పీలు కొట్టివేత
గృహహింస చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఉమ్మడి కుటుంబంలో నివసించడం హక్కు కాదని.. అత్తామామల్ని ఇబ్బంది పెడుతున్న కారణంగా కోడలు వారితో కలిసి నివాసం ఉండకూదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్తామామల వయసు 69, 74 అని.. సీనియర్ సిటిజన్లు చివరి దశలో ప్రశాంతంగా ఉండాలంటే కొడుకు, కోడలు వేరే ఇంట్లో ఉండాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కొడుకుతో వివాహ బంధం ఉన్నంత వరకు కోడలికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేస్తూ ఆమె పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇందుకు ఆమె అత్త అంగీకారం తెలిపారు.


అద్దె ఇంటికి పిటిషనర్ భర్త..
తన భార్య రోజూ తల్లితండ్రులతో గొడవ పడటం చూడలేక అద్దె ఇంటికి భర్త వెళ్లిపోయాడు. పిటిషనర్ మాత్రం అత్తగారింట్లోనే ఉంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆస్తికి పూర్తి యజమాని తానేనని, తన కొడుకు వేరే ప్రదేశంలో నివసిస్తున్నాడని 2016లో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కోడల్ని వేరే చోట నివసించాలని తీర్పు ఇచ్చింది. తనకు అత్తవారింట్లో నివసించేందుకు హక్కు ఉందని దిగువ కోర్టులో వాదించినా కోడల్ని అనుకూలమైన తీర్పు రాలేదు. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఆమెను ఇంటి నుంచి బయటకు పంపే హక్కు ఇంటి యజమానులైన అత్తామామలకు ఉందని, అదే సమయంలో కోడలికి ప్రత్యామ్నాయ నివాస వసతి బాధ్యత వారిపై ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.