క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీపై చైనా మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. బిట్‌కాయిన్ సహా అన్ని రకాల వర్చువల్ కరెన్సీ లావాదేవీలు చట్టబద్ధం కావని చైనా సెంట్రల్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. అనధికార డిజిటల్ కరెన్సీ ఉపయోగించడాన్ని అడ్డుకొనేందుకే ఇలా చేస్తున్నామని వెల్లడించింది.
Also Read: బుల్.. భలే రన్! 60వేల పైనే ముగిసిన సెన్సెక్స్.. ఆ 4 కంపెనీలే కీలకం
'బిట్‌కాయిన్, టెథెర్ సహా అన్ని రకాల క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావు. మార్కెట్లో వాటి చలామణీకి అనుమతి లేదు' అని బ్యాంక్ ఆఫ్ చైనా వెబ్‌సైట్లో ఉంచింది. విదేశీ ఎక్స్ఛేంజీల ద్వారా స్థానికులతో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేపట్టడం, వారికి సేవలు అందించడం అవినీతి ఆర్థిక కార్యకలాపాల కిందకే వస్తుందని బ్యాంకు తెలిపింది.
Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోండి!
క్రిప్టో కరెన్సీలను దాచుకోవడాన్ని 2013లోనే చైనా బ్యాంకులు నిషేధించాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది వాటిపై ప్రకటన చేసింది. క్రిప్టో కరెన్సీ మైనింగ్, ట్రేడింగ్ చేయడం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా నష్టం కలిగిస్తుందని అందులో తెలిపింది. ఈ ప్రకటన చేసిన వెంటనే బిట్ కాయిన్ ధర శుక్రవారం 5.5 శాతం పడిపోయింది.
బిట్‌కాయిన్, ఎథిరెమ్, ఇతర డిజిటల్ కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, మనీలాండరింగ్, సహా ఇతర నేరాలకు కారణమవుతున్నాయని చైనా ఆరోపించింది. వర్చువల్ కరెన్సీ డెరివేటివ్ లావాదేవీలు చట్టబద్ధం కాని ఆర్థిక కార్యకలాపాలని, వాటిని కఠినంగా బహిష్కరిస్తున్నామని చైనా బ్యాంకు స్పష్టం చేసింది.
Also Read: మళ్లీ దుమ్మురేపిన జియో.. పోటీలో ఎయిర్‌టెల్! వొడాఫోన్ ఐడియాకు కష్టాలు
క్రిప్టో కరెన్సీ ఫ్లెక్సిబిలిటీ, గోప్యతకు పెద్దపీట వేస్తాయని వాటి ప్రమోటర్లు చెబుతుండగా ఆర్థిక వ్యవస్థపై అధికార కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ బలహీనమవుతుందని, నేరాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించేందుకు చైనా పీపుల్స్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ వెర్షన్ యువాన్‌ను అభివృద్ధి చేస్తోందని సమాచారం.
భారత్‌లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు బాగానే సాగుతున్నాయి. ఎక్కువ మంది బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దేశంలో దీనిని చట్టబద్ధం చేయడంపై సుదీర్ఘ కాలంగా చర్చలు సాగుతున్నాయి.