Union Budget 2022 LIVE: ఉద్యోగులను కనికరించని నిర్మల.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పుల్లేవ్
Union Budget 2022 India LIVE Updates: ఎప్పటికప్పుడు బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్ ప్రసంగం పూర్తవగానే స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సభను బుధవారం (ఫిబ్రవరి 2) సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.
‘‘జనవరి నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,40, 986 లక్షల కోట్లుగా తేలాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధిక ఆదాయం. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనేందుకు ఇదే ఉదాహరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విషయంలో తీసుకున్న విధానాలు కూడా ఇందుకు కారణం.’’
‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి, వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకురానున్నాం. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతాం. ఏదైనా వర్చువల్ డిజిటల్ ఆస్తిని ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నాం. ఆ ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకున్నప్పుడు ఎటువంటి మినహాయింపు అనుమతించబడదు. మరోవైపు, కార్పొరేట్ సర్‌ఛార్జ్ 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నాం.’’
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని తీపి కబురు చెప్పింది కేంద్రం. లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.
క్రిప్టో కెరన్సీకి కౌంటర్ అన్నట్టుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్ తరహా క్రిప్టో కరెన్సీని తీసుకొస్తున్నట్టు బడ్జెట్‌లో పెట్టింది. ఇండియన్ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్టు పేర్కొెంది. దీన్ని త్వరలోనే RBI విడుదల చేయనుంది.
‘‘బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని జారీ చేస్తాం. 2022-23 నుంచే ఆర్బీఐ ఈ డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింతగా ఊపునిస్తుందని ఆశిస్తున్నాం’’
దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ స్కీమ్
ఐటీఐల్లో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు
త్వరలో డిజిటల్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టులు జారీ
కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభం
ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ
75 నగరాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు
‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించి ఆ దిశగా యువతకు ఆ మార్గాన్ని సూచిస్తున్నాం. దేశీయ యానిమేషన్ మార్కెట్.. ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా సేవలందించడానికి AVGC ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఈ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి ఇంకా కృషి చేస్తాం’’
‘‘టెలికాం సెక్టర్‌లో 5జీ టెక్నాలజీ కోసం స్పెక్ట్రం వేలాన్ని 2022లోనే చేపడతాం. 2022-23లోనే 5జీ అందుబాటులోకి వస్తుంది. 5జీ ద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయి. అన్ని గ్రామాల్లోని ఇళ్లలో పట్టణాల తరహాలో ఈ- సర్వీసులు, డిజిటల్ సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతో పని చేస్తున్నాం. ‘భారత్ నెట్ ప్రాజెక్ట్’లో భాగంగా పీపీపీ పద్ధతిలో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు అందేలా చూస్తాం. ఈ ప్రాజెక్టు 2025 వరకూ పూర్తవుతుంది.’’
మహిళల, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 వంటి పథకాలను మా ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది.
నేచురల్, జీరో-బడ్జెట్ & సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌లు సవరించాలి. దీని కోసం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం.
నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ రూపొందిస్తున్నాం. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సౌకర్యాలు, యునీక్ హెల్త్ ఐడెంటిటీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలు ఉంచుతాం.
‘‘నేషనల్ డిజిటల్ హెల్త్ సిస్టం కోసం ఓ వేదిక రూపొందిస్తాం. ఇది 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుంది. దీనికి నిమ్హాన్స్ నోడల్ సెంటర్‌గా మరియు ట్రిపుల్ ఐటీ బెంగళూరు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. మహమ్మారి అన్ని వయసుల ప్రజలలో మానసిక ఆరోగ్య సమస్యలను పెంచింది. కాబట్టి, నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సేవలకు మెరుగైన సౌకర్యం కోసం, జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తాం. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 2023 వరకు పొడిగిస్తాం.’’
కరోనా కారణంగా అన్ని వయసుల ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వాళ్ల కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సంరక్షణ సేవల కోసం జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభం.
‘‘పీఎం ఈ-విద్య ప్రోగ్రాం కింద వన్ క్లాస్-వన్ టీవీ ఛానెల్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 12 ఛానెళ్ల నుంచి 200 ఛానెళ్లకు పెంచుతాం. వీటి ద్వారా అన్ని రాష్ట్రాలు మంచి విద్యను వారి వారి ప్రాంతీయ భాషలో అందించవచ్చు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠాలను ఆ ఛానెళ్లలో బోధిస్తారు. హై క్వాలిటీ డిజిటల్ టీచింగ్ కంటెంట్‌ను డెవలప్ చేస్తాం. దీన్ని ఇంటర్నెట్ ద్వారా లేదా టీవీ ఛానెళ్ల ద్వారా, రేడియోల ద్వారా విద్యార్థులకు డిజిటల్ టీచర్ల ద్వారా చేరవేస్తాం. ఈ క్వాలిటీ కంటెంట్ తయారీ కోసం బెటర్ డిజిటల్ టూల్స్ ఉపయోగించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొనేలా రూపొందిస్తాం. విద్యార్థులకు డిజిటల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం. దేశమంతా ప్రపంచ స్థాయి యూనివర్సల్ ఎడ్యుకేషన్‌ను అందరూ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాం.’’
‘‘మొదటి దశలో గంగా నది వెంట 5 కిలో మీటర్ల పరిధిలో గల రైతుల భూములపై దృష్టి సారించి కెమికల్ ఫ్రీ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. 2021-22 రబీ సీజన్‌లో గోధుమ ధాన్యం సేకరణ, ఖరీఫ్ సీజన్ 2021-22లో వరి ధాన్య సేకరణ అంచనా ప్రకారం 163 లక్షల మంది రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరిని కొంటాం. రూ. 2.37 లక్షల కోట్లు నేరుగా వారికి మద్దతు విలువ ద్వారా చెల్లిస్తాం.’’
పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది రోప్‌వేల అభివృద్ధికి చర్యలు. అరవైకిలోమీటర్ల దూరంతో ఒక్కో రోప్‌వే నిర్మాణం చేస్తామన్నారు. దేశంలో కొత్తగా డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటుకు అంగీకారం.
వచ్చే మూడేళ్లలో నాలుగు వందలకుపైగా వందే భారత్ రైళ్లు ఏర్పాటుకు అంగీకారం. పీఎం గతి శక్తి ద్వారా పాతిక వేల కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తాం. వంద కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేస్తామన్నారు విత్తమంత్రి. నాలుగు చోట్ల మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటుకు సమ్మతం. కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అగ్రికల్చర్ స్టార్టప్‌ల కోసం నాబార్డు నిధులు ఇస్తామన్నారు.
‘‘కొన్ని నదుల అనుసంధానం కోసం డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. దమన్ గంగా - పిర్ పంజాల్, పర్ తాపీ - నర్మదా, గోదావరి - క్రిష్ణా, క్రిష్ణా - పెన్నా, పెన్నా - కావేరీ నదులు ఎంపిక చేశాం. దీనివల్ల లబ్ధిపొందే రాష్ట్రాల నుంచి అంగీకరం రాగానే ఈ నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది’’
మేకిన్ ఇండియా ద్వారా వచ్చే ఐదేళ్లలో అరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు నిర్మలా సీతారామన్. వచ్చే మూడేళ్లలో నాలుగు వందలకుపైగా వందే భారత్ రైళ్లు ట్రాక్‌లోకి వస్తాయి. పేద మధ్య తరగతి సంక్షేమంపై ఫోకస్ చేశామన్నారు సీతారామన్.
‘‘ఆత్మనిర్మర్ భారత్‌లో భాగంగా రాబోయే మూడు సంవత్సరాలలో 400 నవతరం వందే భారత్ రైళ్లు మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తాం. మరో 100 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ వచ్చే 3 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాం. అంతేకాక, మెట్రో రైలు వ్యవస్థలను నిర్మించడానికి వినూత్న మార్గాలను అమలు చేయనున్నాం’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.
పారదర్శక సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోపడుతుంది. గృహ, వసతులు, తాగునీరు అందివ్వడంలో విజయవంతం అవుతున్నాం. త్వరలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. నీలాంచల్ నిస్పత్ నిఘమ్ లిమిటెడ్‌ను ప్రైవేట్ పరం చేస్తాం.
‘‘ఈ బడ్జెట్ వచ్చే 25 ఏళ్ల కాలానికి బ్లూప్రింట్ లాంటిది. ఎయిర్ ఇండియాను ప్రైవేటు సంస్థకు విక్రయించే ప్రక్రియ పూర్తయింది. అలాగే ఈ వ్యూహాత్మక ప్రైవేటీకరణ పథకంలో భాగంగా నీలాంచల్ ఇస్పాత్ లిమిటెడ్ ప్రైవేటు పరం చేశాం. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరలోనే జరుగుతుంది. మరో రెండు ప్రభుత్వ సంస్థల విక్రయం ప్రాసెస్‌లో ఉంది’’
వచ్చే పాతికేళ్లకు ఈ బడ్జెట్ పునాది వేస్తుందన్నారు నిర్మలా సీతారామన్. ఈ పాతికేళ్లు దేశాభివృద్ధికి అమృతకాలం లాటింది.
‘‘కొవిడ్ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా కలిసొచ్చింది. ఎంతో మంది ప్రజల ప్రాణాలను వ్యాక్సిన్ కాపాడింది. ఆత్మనిర్భర్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీని ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 13 లక్షల కోట్ల కొత్త ఉత్పత్తుల వృద్ధికి ప్రోత్సాహకాలు తర్వాతి 5 ఏళ్లలో అందుతాయి.’’
కోవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ బాగా కలిసి వచ్చింది. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలక పాత్ర వహించింది.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆమె కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండడం ఇది వరుసగా రెండోసారి. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం అయింది.
బడ్జెట్ 2022-23 కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంటులో కేంద్ర కేబినెట్ మంగళవారం ఉదయం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
వరసగా రెండో ఏడాది పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది కేంద్రం. ఈసారి యాప్‌లో బడ్జెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
పార్లమెంటులో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. కేంద్ర బడ్జెట్ 2022-23కు కేంద్ర మంత్రివర్గం కొద్దిసేపట్లో ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిగా వరుసగా నాలుగోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్ 2021-22 సమగ్ర వివరాలు... (గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు)
రంగాలు, ప్రభుత్వ పథకాలు, శాఖలు కేటాయింపు (రూ. కోట్లలో)
వ్యవసాయం, అనుబంధ రంగాలు 1,48,301
గ్రామీణాభివృద్ధి 1,31,519
మధ్యాహ్న భోజన పథకం 11,500
గిరిజన సంక్షేమం 7,524
ఆరోగ్య రంగం 2,23,846
సాంఘిక న్యాయం, సాధికారత శాఖ 11,689
మెనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 4,810.77
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 71,268.77
కోవిడ్ వ్యాక్సిన్ 35,000
విద్యా రంగం 93,224
నైపుణ్యాభివృద్ధి 3000
సమగ్ర శిక్ష అభియాన్ 31,050.16
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ 1,005
రక్షణ రంగం 4,78,000
పౌర విమానయాన శాఖ 3,224
యువజన, క్రీడలు 2596.14
హోం మంత్రిత్వ శాఖ 1,66,547
పర్యాటక శాఖ 2,026
ప్రభుత్వ రంగ బ్యాంకులు 20,000
సింగరేణి కాలరీస్ 2,500
భారత్ నెట్ 7000
మౌలిక వసతులు 5,54000
రోడ్లు, ఉపరితల రవాణా 1,18,101
రైల్వే 1,10,055
శాస్త్ర, సాంకేతిక శాఖ 14,793.66
అంతరిక్ష విభాగం 13,949
పీఎం కిసాన్ పథకం 65,000
ఉపాధి హామీ పథకం (MGNREGA) 73,000
స్వచ్చ భారత్ సెకండ్ ఫేజ్ 12,294
జల్ జీవన్ మిషన్ 50,011
జనగణన 3,726
సముద్ర అధ్యయన మిషన్ 4,000
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 15,000
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన 3,600
ఆత్మ నిర్భర్ యోజన 64,180
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 19,500
విదేశాలకు సాయం 7,100
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2,869.93
ఇదీ బడ్జెట్ చరిత్ర
భారత్ బడ్జెట్‌ది దాదాపు 162 ఏళ్ల చరిత్ర. తొలిసారిగా ఏప్రిల్ 7,1860లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది జేమ్స్ విల్సన్ (స్కాటిష్). స్వాతంత్ర్య భారత్‌లో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది మాత్రం షణ్ముగం చెట్టి. 26-11-1947లో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం
అతి పెద్ద బడ్జెట్ ఇదే
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎక్కువ పదాలు ఉన్న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్‌లో 18వేల 650 పదాలు ఉన్నాయి. 2018లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 18,605 పదాలున్న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆయన దీన్ని కేవలం గంటా నలభై తొమ్మిది నిమిషాల్లో చదివేశారు.
అతి చిన్న బడ్జెట్ ఇదే
1977లో ప్రవేశ పెట్టిందే అతి చిన్న బడ్జెట్. కేవలం ఎనిమిది వందల పదాలతో ఆర్థికమంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
మొరార్జీ దేశాయ్ టాప్
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1962-69 మధ్య పదిసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారాయన. తర్వాత పీ. చిదంబరం తొమ్మిదిసార్లు, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా ఎనిమిది సార్లు మన్మోహన్ సింగ్ ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
కాలం మారిందప్పుడే
1999 వరకు కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి పని దినం సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టేవాళ్లు ఇది బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన సంప్రదాయం. కానీ 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ సంప్రదాయాన్ని మార్చేశారు. ఉదయం 11 గంటలకే ప్రవేశ పెట్టడం స్టార్ట్ చేశారు.
2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు.
మొదట్నించీ ఇంగ్లీష్‌లోనే
1995వరకు బడ్జెట్‌ను ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రచురించేవారు. కానీ ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను హిందీ, ఇంగ్లీష్‌లో ప్రచురించడం స్టార్ట్ చేసింది.
పేపర్‌లెస్ బడ్జెట్
కరోనా కారణంగా తొలిసారిగా 2021-22లో కాగితరహిత బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ
1970-71బడ్జెట్‌ను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి.. తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 2019లో నిర్మలాసీతారామన్ రెండో మహిళగా నిలిచారు.
రైల్వే బడ్జెట్
2017 వరకు 92 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్‌ను వేరుగా ఉభయసభల్లో ప్రవేశ పెట్టేవాళ్లు. 2017తర్వాత సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ను కలిపిసి సభకు సమర్పిస్తున్నారు.
Background
సామాన్య ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక రంగం ఎంతో ఆశగా ఎదురు చూసే బిగ్ డే రానే వచ్చింది. కరోనా రక్కసి ఇంకా పీడిస్తున్న వేళలో కేంద్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిల నగారా మోగి ప్రచారం హోరాహోరీన సాగుతోంది. రైతుల తమ పోరుకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. వేతన జీవులు సీతమ్మ కరుణించమ్మా అంటు వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం బడ్జెట్ 2022-23ను సభ ముందు ఉంచనున్నారు.
నిర్మలా సీతారామన్ ఈ సారి పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతారని అంతా భావిస్తున్నారు. రూ.15 లక్షల పైనా శ్లాబులను సవరిస్తారన్న అంచనాలు ఉన్నాయి.
వేతన జీవులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారం తగ్గించే దిశగా సాగుతున్నట్టు తెలిసింది. పన్ను భారం తగ్గించేందుకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచుతారని సమాచారం. 2022, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెబుతారని అంతా అంచనా వేస్తున్నారు.
పన్ను మినహాయింపు రూ.75వేలకు పెంపు!
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000గా ఉంది. నిర్మలా సీతారామన్ ఈ పరిమితిని రూ.75,000 లేదా 50 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఒకవేళ పెంచితే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది నాలుగో సారి అవుతుంది. బిజినెస్ ఛాంబర్లు, చాలామంది ఆర్థిక వేత్తలు బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచి పన్ను చెల్లింపుదారులపై ధరలు, పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
CM.. ఇంకా చెప్పాలంటే కామన్ మ్యాన్! ఈ ఏడాది బడ్జెట్ నుంచి భారీగానే ఆశిస్తున్నాడు! పన్నులు తగ్గించాలని, గృహ రుణాల వడ్డీలపై మినహాయింపు పెంచాలని, సింపుల్‌గా ఆదాయపన్ను దాఖలు చేసేలా సరళీకరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని FM.. అదే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నాడు. మరి సామాన్యుడి వినతులను మేడమ్ ఆలకిస్తారా!!
కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం అన్ని రంగాల్లాగే ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది. దేశవాళీ ఉత్పత్తి పెంచడానికి, కొత్త టెక్నాలజీలు తీసుకురావడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీలు కావాలంటే భవిష్యత్తులు పెట్టుబడులను ఆహ్వానించడం తప్పనిసరి. ఈ తరహా పెట్టుబడులకు ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తుందేమో అని పరిశ్రమ ఎదురుచూస్తోంది.
గ్రాండ్ థోర్టన్ సర్వే ప్రకారం 84 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఇన్సెంటివ్‌లు అందిస్తారని అంచనా వేస్తున్నారు. స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సాయం కావాలని 74 శాతం మంది, మెరుగైన ఆటోమోటివ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ బేస్ కావాలని 75 శాతం మంది కోరారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -