వరుస పెట్టి వస్తున్న కరోనా వేరియెంట్లు, వస్తు సరఫరా గొలుసులో అవాంతరాలు, తెరపైకి ద్రవ్యోల్బణం వంటి ఇబ్బందులు ఎన్నొచ్చినా ప్రభుత్వం కీలక రంగాల్లో ఉపాధిని కల్పించింది. సోమవారం విడుదలైన ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2021, జులై నాటికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ (PM-GKRA) కింద 50.8 కోట్ల మానవ పనిదినాలను కల్పించింది. ఇందుకోసం రూ.39,293 కోట్లు ఖర్చు చేసింది.
* బిహార్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ వలస కార్మికులు తిరిగి స్వరాష్ట్రాలకు చేరుకున్నప్పుడు పీఎం-జీకేఆర్‌ఏ పథకం ప్రవేశపెట్టారు. వారికి సత్వరమే ఉపాధి కల్పించారు.
* ఇక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 2021, నవంబర్ నాటికి 8.85 కోట్ల ఉపాధి కల్పించింది. ఇందుకు రూ.68,233 కోట్ల నిధులు విడుదల చేసింది.
* కంపెనీలపై భారం పడకుండా, ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకొనేలా ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ABRY) పథకం ప్రవేశపెట్టారు. దీనిని ఈపీఎఫ్‌వో అమలు చేసింది. దీనివల్ల 2021, నవంబర్ నాటికి 1.15 లక్షల కంపెనీల ద్వారా 39.43 లక్షల మందికి లబ్ధి చేకూరింది.
* ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వచనం మార్చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు - క్లస్టర్ అభివృద్ధి పథకం (MSE-CDP), ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP), సంప్రదాయబద్ధంగా నడుస్తున్న సంస్థలను ఐటీ తరహాలో మార్చేందుకు (SFURTI) పథకాలను అమలు చేసింది.
* ఎంఎస్‌ఎంఈల మధ్య అణచివేత ధోరణి పోగొట్టి ఆరోగ్యకరమైన పోటీ పెంచేందుకు, సులభతర వాణిజ్య విధానం అమలు చేసేందుకు సరికొత్తగా ఉదయం నమోదు పోర్టల్‌ను ప్రభుత్వం ఆవిష్కరించింది. స్వీయ ధ్రువీకరణ పత్రంతో డిజిటల్‌గానే ఇందులో కంపెనీలు నమోదు చేసుకోవచ్చు.
* ఉదయం పోర్టల్‌లో 2022, జనవరి నాటికి 66,34,006 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో 62,79,858 సూక్ష్మ, 3,19,793 చిన్న, 34,355 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. టోకు, రిటైల్, వీధి వర్తకులు సైతం నమోదు చేసుకొనేలా అనుమతి ఇచ్చారు.
* 2021-22 ఆర్థిక ఏడాదిలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు కేటాయింపులు రూ.61,500 కోట్ల నుంచి రూ.73,000 కోట్లకు పెంచారు. 2021-22లో ఇప్పటి వరకు రూ.98000 కోట్లకు పెంచారు. 2021-22లో 8.70 కోట్ల మందికి, 6.10 కోట్ల కుటుంబాలకు పని కల్పించారు.
* 2021, డిసెంబర్ నాటికి 8.07 కోట్ల మంది స్వయం సహాయక బృందాల్లో ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేస్తున్నవారు 1.47 కోట్ల మంది ఉన్నారు. వ్యవసాయేతర రంగాలపై ఆధారపడ్డ వారు 1.82 కోట్ల మంది ఉన్నారు.