CM.. ఇంకా చెప్పాలంటే కామన్‌ మ్యాన్‌! ఈ ఏడాది బడ్జెట్‌ నుంచి భారీగానే ఆశిస్తున్నాడు! పన్నులు తగ్గించాలని, గృహ రుణాల వడ్డీలపై మినహాయింపు పెంచాలని, సింపుల్‌గా ఆదాయపన్ను దాఖలు చేసేలా సరళీకరించాలని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలని FM.. అదే కేంద్ర ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నాడు. మరి సామాన్యుడి వినతులను మేడమ్‌ ఆలకిస్తారా!!


క్రిప్టో బిల్లుపై స్పష్టత


క్రిప్టో కరెన్సీ బిల్లుపై అప్‌డేట్‌ను సామాన్యుడు కోరుకుంటున్నాడు! ఎందుకంటే చాలామంది ఏమీ తెలియకుండానే బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేశారు. రద్దు, నిషేధం వంటి మాటలు వినిపిస్తుండటంతో ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. 'క్రిప్టోలపై పన్ను, వర్గీకరణ, అమలు చేసే పన్ను రేట్లు, టీడీఎస్‌, టీసీఎస్‌, క్రిప్టో కరెన్సీ కొనుగోలు, అమ్మకాలపై జీఎస్‌టీ అమలు వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని టాక్స్‌2విన్‌ సీఈవో అభిషేక్‌ సోనీ అంటున్నారు.


పన్ను శ్లాబులు


వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను సవరించాలని తక్కువ ఆదాయ వర్గాలు కోరుకుంటున్నాయి. రెండు రకాల పన్ను విధానాలతో సామాన్యుడు గందరగోళానికి గురయ్యాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 'ఇప్పుడున్న అత్యధిక పన్ను శ్లాబ్‌ రూ.15 లక్షలను రూ.20 లక్షలకు పెంచొచ్చు. లేదా కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు 2021 బడ్జెట్‌తో ఊరట కలగలేదు' అని అభిషేక్‌ పేర్కొన్నారు.


WFH అలవెన్సులు, మినహాయింపులు


ఈ ఏడాది బడ్జెట్‌లో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు పన్ను ఆకర్షించని WFH అలవెన్సులను పరిచయం చేయొచ్చు. ఇంటి ఖర్చులపై మినహాయింపులు పెరగడంతో చేతికందే వేతనం పెరుగుతుంది. దేశంలో వస్తువులకు గిరాకీ పెరుగుతుందని అంచనా. 'ఈ ఆర్థిక ఏడాదిలో ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా వసూలయ్యాయి. ఇది పన్ను మినహాయింపులు పెంచేందుకు ఆస్కారం ఇస్తుంది. వేతనం పెరుగుదలకు తోడు ఇప్పుడున్న రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచే అవకాశాలు ఉన్నాయి' అని అభిషేక్‌ అన్నారు.


సెక్షన్‌ 80C పరిమితి పెంపు


ఆదాయపన్ను సెక్షన్‌ 80C కింద ఇప్పుడు కేవలం రూ.1.5 లక్షల వరకే పన్ను మినహాయింపు ఉంది. ఐదేళ్లుగా ఇందులో మార్పేమీ లేదు. ప్రస్తుత కరోనా సందర్భంలో దీనిని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు, మ్యూచువల్‌ ఫండ్లలో ఎక్కువ పెట్టుబడులు పెరిగేలా ప్రత్యేక మినహాయింపులు, కొవిడ్‌ ఖర్చులపై మినహాయింపును సెక్షన్‌ 80D లేదా 80DDB కింద ఇవ్వొచ్చు. ఇంటి రుణంపై వడ్డీ మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచాలి. 


సులభంగా ITR దాఖలు


దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ వేగంగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం చాలామంది ఓ చిక్కుముడే. వేతనం మాత్రమే కాకుండా ఇతర ఆదాయ మార్గాలున్నప్పుడు ఐటీఆర్‌ దాఖలు చేయడం సంక్లిష్టంగా మారుతోంది. అందుకే ఇలాంటి సంక్లిష్టతలు లేకుండా ఐటీఆర్‌ దాఖలును మరింత సులభతరం చేయాలని కామన్‌ మ్యాన్‌ డిమాండ్‌. ఆ దిశగా ఈ సారి చర్యలు తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.