పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. దీంతో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే చివరి ప్రసంగం. తన ప్రసంగంలో రామ్‌నాథ్ కోవింద్.. కొవిడ్‌పై భారత్ పోరాటం, గణతంత్ర వేడుకలు, వ్యాక్సినేషన్, అభివృద్ధి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
పోరాటం స్ఫూర్తిదాయకం..
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పిస్తున్నాను. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాం. భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయి. అర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. - రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
అదే ఉదాహరణ..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతం కావాలి. 2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించారు. ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువ. డిజిటల్ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదాహరణ. - రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి