Economic Survey 2022: బడ్జెట్ 2022 సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ప్రసంగించారు. కరోనా మహమ్మారి వేధిస్తున్న సమయంలో వైద్య, ఆరోగ్య రంగంలో భారత సాధించిన పురోగతిని ఆయన వివరించారు. స్వయంగా టీకాలను తయారు చేసి ప్రపంచానికి ఊరట కల్పించిందని వెల్లడించారు.
కరోనా మహమ్మారిపై చేసిన మహత్తర పోరాటానికి టీకా కార్యక్రమం ఒక సాక్ష్యంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 'టీకా కార్యక్రమం ఆరంభించిన ఏడాది లోపే 150 కోట్ల డోసులు వేశాం. ప్రపంచంలోనే అత్యధిక టీకాలు వేసిన దేశాల్లో మనం ఈ రోజు అగ్రభాగాన నిలిచాం' అని ఆయన ప్రశంసించారు. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక సర్వే విశేషాలు, సారాంశం
* 2022 ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధిరేటును 9.2 శాతంగా అంచనా వేసింది.
* 2023 ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధిరేటును 8 నుంచి 8.5 శాతం మధ్య అంచనా వేసింది.
* ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది.
* 2021-22కు వ్యవసాయ రంగం అభివృద్ధి 3.9 శాతం ఉండనుంది.
* 2021-22కు పారిశ్రామిక రంగం వృద్ధిరేటు 11.8 శాతంగా ఉంటుంది.
* 2021-22కు సేవల రంగం వృద్ధిరేటు 8.2 శాతంగా అంచనా.
* ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ (PM-GKRA) కింద 50.8 కోట్ల మానవ పనిదినాలను కల్పించింది. ఇందుకోసం రూ.39,293 కోట్లు ఖర్చు చేసింది.
* మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 2021, నవంబర్ నాటికి 8.85 కోట్ల ఉపాధి కల్పించింది. ఇందుకు రూ.68,233 కోట్ల నిధులు విడుదల చేసింది.
* 2022-23 ఏడాదిలో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్థూల ఆర్థిక సంకేతాలు తెలియజేస్తున్నాయి.
* డిమాండ్ మేనేజ్‌మెంట్‌తో పోలిస్తే సరఫరా వైపు సంస్కరణలను భారత్ సమర్థంగా చేపట్టింది.
* ఎగుమతుల్లో వేగంగా వృద్ధి చెందుతున్నాం. ఆర్థిక రంగంలో పెట్టుబడులకు స్కోప్ ఉంది.
* విస్తృతంగా టీకాలు వేయడం 2023 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధికి మద్దతుగా ఉంది.