పెరుగుతున్న టెక్నాలజీతో లేటెస్టుగా వస్తున్న కార్ల అత్యాధునికి భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటున్నాయి. అయితే, వాటిని సరిగా వినియోగించుకోలేక చాలా మంది వాహనదారులు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా గతేడాది దేశ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో సీటు బెల్ట్ ధరించక పోవడం వల్లే ఎక్కువ మంది చనిపోయినట్లు వివరించింది. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి విడుదల చేసిన నివేదికలో 16,000 మందికి పైగా సీటు బెల్టు పెట్టుకోలేదని తెలిపింది. అందులోనూ దాదాపు సగం మంది వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న వాళ్లేనని తేల్చి చెప్పింది.


సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది మృతి


MRTH నివేదిక ప్రకారం.. 2021లో మొత్తం 16,397 మంది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీటులో కూర్చునే వారిలో ఎక్కువ మంది సీటు బెల్టు పెట్టుకోవట్లేని తెలిపింది.  సీటు బెల్టు ధరించని కారణంగా మరణించిన వారిలో దాదాపు సగం మంది వెనుక సీట్లలోనే ఉన్నట్లు వివరించింది. చనిపోయిన వారిలో  7,959 మంది వెనుక సీట్లలో కూర్చుని ప్రయాణిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మిగతా 8,438 మంది డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే చనిపోయారని తెలిపింది.  


కారులోని వాళ్లంతా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే!


గత కొంత కాలంగా సేఫ్టీ ఫీచర్ల గురించి ప్రభుత్వాలు, పోలీసులు ప్రయాణీకులకు వివరిస్తున్నారు. తప్పని సరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల, కారులో ఉన్న వారందరూ తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సీటు బెల్ట్ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి కేంద్రం, పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే సైరస్ మిస్త్రీ మృతి


సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే టాటా సంస్థ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు. సెప్టెంబర్ 4న మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనప్పుడు ఆయన సీటు బెల్ట్ ధరించలేదు. మిస్త్రీ, అతని స్నేహితుడితో కలిసి మెర్సిడెస్ కారు వెనుక సీటులో కూర్చున్నారు. సీట్ బెల్ట్ ధరించని కారణంగా, కారు డివైడర్‌ను ఢీకొన్నప్పుడు  వేగంతో ముందు సీట్లకు తగిలారు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయారు.


సీటు బెల్టు పెట్టుకోకపోతే జరిమానా తప్పదు


వాస్తవానికి సీటు బెల్ట్ నిబంధన చాలా కాలంగా సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌ లో భాగంగా ఉంది. అయినప్పటికీ, ప్రజలు తరచుగా ఈ రహదారి భద్రతా ప్రమాణాన్ని పాటించడం లేదు. ముఖ్యంగా కారు వెనుక సీటులో కూర్చున్నప్పుడు మరింత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాస్తవానికి ఈ ట్రాఫిక్ నియమాన్ని పాటించకపోతే ₹1,000 జరిమానా విధించాలని సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌ లిస్టులో ఉంది.


Read Also: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?