త్తరాఖండ్‌లోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో రిషబ్ కారు అద్దాలను పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, కారులో మంటలు చెలరేగడం అనేది కొత్త విషయం కాదు. చాలా ప్రమాదాల్లో డ్రైవర్లు, ప్రయాణికులు కార్లోనే సజీవ దహనమైన కేసులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కారు నడిపేవారు కాదు.. కారులో ప్రయాణించేవారు సైతం దీనిపై అవగాహన పెంచుకోవడం అవసరం. 


ప్రమాద సమయంలో కారులో మంటలు ఎందుకు చెలరేగుతాయి?


ప్రమాద సమయంలో లేదంటే సాధారణంగా కార్లలో మంటలు రావడానికి బేసిక్ రీజన్స్ ఇంధన వ్యవస్థ, లేదంటే విద్యుత్ వ్యవస్థలో లోపాలు. ఎలక్ట్రికల్, ఇంధన ఆధారిత మంటలు తరచుగా తయారీ, డిజైన్ లోపాల వల్ల సంభవిస్తాయి. ఐదు ప్రమాదాల్లో ఇలాంటివి ఒకటి రెండు ఉంటాయని తేలింది. అందుకే, ఇంధన వ్యవస్థ, ఇంజిన్ కంపార్ట్‌ మెంట్‌లో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే భాగాలను రీకాల్ చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎలక్ట్రికల్, ఇంధన-ఆధారిత మంటలు తరుచుగా సమస్యలు ఉన్న వాహనాల్లోనే ఎక్కువగా సంభవిస్తాయి.


అగ్ని ప్రమాదానికి దారితీసే ప్రధాన వాహన లోపాలు  


ఇంధన ట్యాంకులు, లైన్ల లీకులు


ఇంధన ట్యాంకులు వెనుక చక్రాలకు ముందు ఉండాలి. యాంటీ-పంక్చర్ షీల్డ్‌ లు, ఫ్యూయల్ సెల్ బ్లాడర్‌లను కలిగి ఉండాలి. ఇంధన ట్యాంకుల ప్రాంతంలో బ్రాకెట్లు, పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఇంధన ట్యాంకులు లీక్ కాకుండా చూసుకోవాలి. ఇంధన ట్యాంకుల్లో లీకులు ఉండటం మూలంగా ప్రమాద సమయంలో పగిలి మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. గ్యాసోలిన్‌తో పాటు, కారులోని కొన్ని భాగాలు మండే పదార్థాలను కలిగి ఉంటాయి. గ్యాసోలిన్ లీకైతే వెంటనే మంటలు విస్తరిస్తాయి.


విద్యుత్ వ్యవస్థ లోపాలు


విద్యుత్ వ్యవస్థలో లోపాల కారణంగా డాష్‌ బోర్డ్‌, దాని చుట్టూ మంటలు చెలరేగుతాయి. ప్రమాదం ఎక్కువగా ఉన్న సమయంలో కేబుల్స్ తెగి, ఇంధనాన్ని మండించే స్పార్క్‌ లకు కారణం అవుతాయి. ఇగ్నిషన్ సిస్టమ్‌లలో వైరింగ్ తప్పుగా ఉంటే కూడా మంటలు ఏర్పడుతాయి.


తీవ్రమైన ఇంజన్ వైఫల్యాలు


చాలా కార్లలో మంటలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పడతాయి. బ్యాటరీని సరిగా బిగించకపోవడం వల్ల మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. బ్యాటరీని సరిగ్గా డిజైన్ చేయనప్పుడు ఈ ప్రమాదం ఏర్పడుతుంది.


కారుకు మంటలు అంటుకోకుండా ఎలా నిరోధించాలి?


వాహనాల్లో మంటలు సాంకేతిక సమస్యలు, ప్రమాద సమయంలోనే చెలరేగుతాయి కాబట్టి వాటిని నిరోధించడం చాలా వరకు కష్టం. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. 


⦿ శిక్షణ పొందిన మెకానిక్‌తో మీ కారును క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోవాలి.


⦿ ఇంధన ట్యాంకు లేదంటే పంపిణీ వ్యస్థలో లీకులు గుర్తిస్తే వెంటనే సరిచేయించాలి.


⦿ తప్పనిసరిగా గ్యాసోలిన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటే, సీలు చేసి ధృవీకరించబడిన గ్యాస్ క్యాన్‌లో కొద్ది మొత్తాన్ని మాత్రమే రవాణా చేయాలి.   


⦿ వైరింగ్, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే సరిచేయాలి.


⦿ చక్కగా మెయింటెయిన్ చేయబడిన వాహనం మంటలు అంటుకునే అవకాశం తక్కువ.


కారులో మంటలు రాగానే ఏం చేయాలి?


⦿ కారులో పొగలు వస్తున్నట్లయితే.. వెంటనే పక్కన ఆపాలి. అంతా కారు నుంచి దిగిపోవాలి. ఆ తర్వాత కారు సర్వీస్ సెంటర్‌కు కాల్ చేయాలి. 
⦿ ఒక వేళ కారు మంటల్లో  చిక్కుకోగానే.. వస్తువులు గురించి ఆలోచించకుండా బయటకు వచ్చేందు ప్రయత్నించాలి. గాయాలైనా సరే, ఏదో ఒకలా బయటకు వస్తేనే ప్రాణాలు నిలుస్తాయి. ఎందుకంటే.. మంటలు రాగానే కారు పేలుడుకు గురికావచ్చు.  
⦿ కేవలం మీరు బయటపడటమే కాదు, మీ తోటి ప్రయాణికులను కూడా కారు నుంచి వీలైనంత త్వరగా బయటకు లాగేందుకు ప్రయత్నించాలి. తలుపులను వెంటనే అన్‌లాక్ చేయండి. కుదరకపోతే అద్దాలు పగలగొట్టి వారిని బయటకు లాగండి. స్థానికుల సాయం కోసం ప్రయత్నించండి. 
⦿ అత్యవసర సేవలను సంప్రదించండి: అవసరమైతే వెంటనే అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ పోలీసు లేదా అంబులెన్స్‌ను సంప్రదించండి.
⦿ పరిస్థితులు అనుకూలించిన తర్వాత బీమా ప్రొవైడర్, కార్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి. బీమా కంపెనీ నుండి ఎగ్జిక్యూటివ్ స్పాట్‌కు వచ్చే వరకు వేచి ఉండండి. దావా ప్రయోజనాల కోసం నష్టాన్ని అంచనా వేయడానికి సహకరించండి. 


Read Also: ఓ మై గాడ్, సీటు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకండి, లేదంటే ఆ లిస్టులో మీరూ చేరిపోవచ్చు!