రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. కార్లలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రమాద సమయంలో ప్రయాణీకుల ప్రాణాలను కాపాడేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడుతున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది సీటు బెల్టు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, 83% డ్రైవర్లు, ప్రయాణీకులు తమ సీటు బెల్ట్‌లను ధరిస్తారు. 17% మంది వాహన ప్రయాణీకులు ప్రమాదాల సమయంలో గాయపడుతున్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోతున్నారు. CDC ప్రకారం, సీటు బెల్టులు ప్రమాద మరణాలను సగానికిపైగా తగ్గిస్తాయని తేలింది. సీట్ బెల్ట్ ధరించడం మూలంగా చాలా లాభాలు ఉన్నాయి.
సీటు బెల్టుతో ప్రాణాలు సేఫ్
ప్రయాణ సమయంలో కారు స్కిడ్ అయితే సీటు బెల్ట్ మిమ్మల్ని కారులో సీటు నుంచి జారిపోకుండా కాపాడుతుంది. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ ప్రకారం.. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే వాహనంలో నుంచి బయటపడరు. కారు లోపలే ఉండటం మూలంగా ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉంటుంది. సీటు బెల్టు తల, ఛాతీ, వెన్నెముక, పొత్తి కడుపుపై బలమైన గాయాలు కాకుండా కాపాడుతుంది. కారులో ప్రయాణిస్తుంటే.. ప్రయాణీకుల శరీరం కూడా అదే వేగంతో ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో ప్రమాదం జరిగితే డ్రైవర్ స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డ్ లేదంటే సైడ్ విండోను తాకే అవకాశం ఉంటుంది. సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రయాణీకులు సీటుకు సురక్షితంగా ఉంటారు. కారు అకస్మాత్తుగా ఆగిపోతే వారి బాడీ కూడా అలాగే ఆగిపోతుంది. ప్రమాద సమయంలో తలకు బలమైన గాయాలు అవుతాయి. ఈ గాయాలు ఒక్కోసారి ప్రాణాలు తీసే అవకాశం ఉంది. అదే సమయంలో వెన్నెముక సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సీటు బెల్టు మూలంగా సీటుకు అంటిపెట్టుకుని ఉంటారు.
ఏడాదికి 25 వేల మంది మృతి
కారు ప్రమాదాల్లో ఏడాదికి 25 వేల మంది చనిపోతున్నారు. వారిలో చాలా మంది సీటు బెల్టు పెట్టుకోని వారే. సీటు బెల్టు పెట్టుకుంటే ఈ సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సీటు బెల్ట్ ధరించడం వల్ల తీవ్రమైన గాయాల ప్రమాదాన్ని 50% తగ్గించవచ్చు. సీటు బెల్ట్ వాడకం ప్రమాద మరణాలను 45% తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం సీటు బెల్టు ద్వారా సగటున 15,000 మంది ప్రాణాలతో బయటపడుతున్నారు.
ఇతర భద్రతా లక్షణాలతో కూడిన సీట్ బెల్టులు
అద్భుతమైన భద్రతా రేటింగ్, అదనపు ఫీచర్లతో కారును నడుపుతున్నప్పటికీ, సీటు బెల్టు ధరించడం చాలా ముఖ్యం. ఎయిర్ బ్యాగ్ లు, లేన్ డిపార్చర్ వార్నింగ్ లు ఎక్కువగా ఉండటం వల్ల సీట్ బెల్టులు వాడుకలో లేవని కొందరు డ్రైవర్లు తప్పుగా భావిస్తున్నారు. అయితే, ఎయిర్ బ్యాగ్ లు సీట్ బెల్టులతో పనిచేసేలా రూపొందించబడ్డాయి. అవి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఎల్లవేళలా కారులో ప్రయాణం చేసే సమయంలో సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలి. ఈ ముఖ్యమైన విషయాన్ని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి.