Buying Royal Enfield Bikes Online From Flipkart: బైక్‌ మార్కెట్‌ను దడదడలాడిస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండిని కొనడానికి మీరు ఇప్పుడు షోరూమ్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. హాయిగా ఇంట్లో కూర్చుని, మీకు ఇష్టమైన బండిని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చు, ఇంటి వద్దే డెలివెరీ తీసుకోవచ్చు. మన దేశంలో తొలిసారిగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రతిష్టాత్మక మోటార్‌ సైకిల్ బ్రాండ్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. అంటే, మీకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు & అది నేరుగా మీ ఇంటి వాకిట్లోకి వచ్చి వాలుతుంది.

ఇప్పటికే, బజాజ్, హీరో, టీవీఎస్ వంటి కంపెనీల బైక్‌లను కూడా ఫ్లిప్‌కార్ట్‌ తన ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో చేర్చింది & ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరును కూడా ఈ జాబితాలో యాడ్‌ చేసింది. షోరూమ్‌కి వెళ్లడానికి ఇబ్బంది పడే వాళ్లు లేదా అంత టైమ్‌ లేని వాళ్లు బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సౌకర్యాలను ఇంట్లోనే కూర్చునే పొందేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఇనీషియేటివ్‌ సపోర్ట్‌ చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 350cc సెగ్మెంట్ బైక్‌లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి & యూత్‌ నుంచి సీనియర్‌ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బంట్లు ఫేవరేట్‌ బైక్‌లుగా మారాయి. పెర్ఫార్మెన్స్‌ & స్టైల్‌ రెండింటిలోనూ ఇవి పాపులర్‌ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోడళ్లలో Hunter 350 ధర రూ.1,49,900, Bullet 350 ధర రూ.1,74,875, Classic 350 ధర రూ.1,95,300, Meteor 350 ధర రూ.2,08,270 & Goan Classic 350 ధర రూ.2,35,000 గా ఉన్నాయి.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్‌ అయిన అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 20.2 bhp పవర్ & 27 Nm టార్క్ జనరేట్‌ చేసే 349cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌లతో పవర్‌ పొందుతాయి. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో యాడ్‌ అయి ఉంటుంది, ఇది స్మూత్‌ పవర్‌ను డెలివెరీ చేస్తుంది. ఈ సెటప్ నగర ట్రాఫిక్‌ రైడింగ్‌ మాత్రమే కాకుండా హైవేలపై అధిక వేగంలోనూ స్మూత్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

త్వరలో అమ్మకాలుఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ బైక్‌లను సమాచారం & ధరలతో మాత్రమే లిస్ట్‌ చేసింది, Buy బటన్‌కు ఇంకా యాక్సెస్‌ ఇవ్వలేదు. అంటే, వెబ్‌సైట్ నుంచి నేరుగా కొనుగోలు చేసే సౌకర్యం ఇంకా ప్రారంభం కాలేదు. మరికొన్నాళ్లలో Buy బటన్‌ యాక్టివేట్‌ కావచ్చు. అప్పుడు, ఫ్లిప్‌కార్ట్ నుంచి మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేదా ఇతర ప్రొడక్ట్‌ను ఆర్డర్‌ చేసినట్లుగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కూడా ఆర్డర్‌ చేయవచ్చు, డోర్‌ స్టెప్స్‌ దగ్గర డెలివెరీ తీసుకోవచ్చు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ లవర్స్‌ తమ కలల బైక్‌ స్పెసిఫికేషన్లు, ప్రైస్‌ & ఆఫర్లను ఇంటిలోనే విశ్రాంతిగా కూర్చుని ఫ్లిప్‌కార్ట్‌లో తెలుసుకోవచ్చు, వివిధ బైక్‌లను పోల్చుకుని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎంట్రీ గేమ్-ఛేంజర్ స్టెప్‌ కావచ్చు, ఇది భారతదేశంలోని ద్విచక్ర వాహన పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేయగలదని భావిస్తున్నారు.