Ragurama letter To Amit Shah :  ఏపీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మూడు రాజధానులు అని మంత్రులు మాట్లాడుతున్నారని... ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రైతులు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని .. వారి పాదయాత్రపై కుట్ర చేస్తున్నారన్న అనుమానాలున్నాయని..  అలజడి సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని లేఖలో అమిత్ షాను రఘురామకృష్ణరాజు కోరారు. 


ఏపీ ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లులు పెడుతుందనే ప్రచారం


ఈ నెల పదిహేనో తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై రఘురామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఒకవేళ అలా బిల్లు ప్రవేశ పెడితే అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ గోపాల గౌడ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.    మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కేసును పరిశీలించి ఉండి ఉంటే.. ముఖ్యమంత్రి, సీఎస్‌లు అరెస్టుకు ఆదేశాలు జారీ చేసేవాడిని అంటూ జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారని చెబుతున్నారు.  


గవర్నర్ వద్దకు వస్తే తిప్పి పంపాలని రఘురామ సూచన
 


ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపగానే ఆయన వాటిని పరిశీలిస్తారో.. లేదోనన్న అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను ఒక్కసారి పరిశీలించాలని గవర్నర్ కు సూచించవలసినదిగా కేంద్రాన్ని కోరుతానని ఇప్పటికే ప్రకటించారు.  ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ గవర్నర్‌లో ఆ చురుకుదనం కనిపించడం లేదన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు మాజీ సీజే చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు తీర్పుకు భిన్నంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పి.. ఆ బిల్లును గవర్నర్ న్యాయ పరిశీలనకు పంపాలని అమరావతి రైతుల పక్షాన కోరుతున్నానని చెబుతున్నారు. 


రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాలన్న రఘురామ


మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బ తగిలినా మూడు రాజధానుల బిల్లు పెడతామని.. చెబుతున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే మూడు రాజధానులు పెట్టుకోవడానికి న్యాయపరమైన అడ్డంకులు ఉండవని చెబుతున్నారు. కానీ ఏపీ మాత్రం మూడు రాజధానుల బిల్లు తెచ్చే ప్రయత్నంలో ఉండటంతో వివాదాస్పదమవుతోంది. 


పార్టీని ప్రక్షాళన చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత - ప్రస్తుత టీంతో గట్టెక్కలేమని భావిస్తున్నారా ?