Andhra Pradesh News | విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇచ్చిన స్టేట్‌మెంట్ తరువాత నోటీసులు రావడంతో విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ క్రమంలో విజయవాడలో సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) శనివారం ఉదయం వెళ్లారు. అక్కడ అధికారుల ముందు విచారణకు హాజరైన మిథున్ రెడ్డిపై అధికారులు లిక్కర్ స్కాంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడని విమర్శలు
ఎంపీ మిథున్ రెడ్డితో పాటు సిట్ ఆఫీసుకు కోరుముట్ల శ్రీనివాస్ వెళ్లారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి. అందుకే ఆయన టీడీపీ, కూటమి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులపై బురద చల్లాలన్న ఉద్దేశంతో మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో లిక్కర్ పై న్యాయమార్గంలో సిట్ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ సూచించారు.
రాజ్ కసిరెడ్డే సూత్రధారి అంటున్న విజయసాయిరెడ్డి
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డే అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. లిక్కర్ కేసులో విచారణలో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజ్ కసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నారని విజయసాయిరెడ్డి బయటపెట్టారు. నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అధికారులు నేడు మిథున్‌రెడ్డిని విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ సైతం లిక్కర్ స్కాంలో ఉందని విమర్శలు వచ్చాయి. అయితే తన కూతురు, అల్లుడికి సంబంధించిన వ్యాపారాలలో తన ప్రమేయం లేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం కనిపించడం లేదు. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా, రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కావడం లేదు. ఆయన తండ్రికి సైతం అధికారులు నోటీసులు ఇవ్వగా, విచారణకు ఆయన హాజరయ్యారు. మరోవైపు పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి కోసం త్వరలో గాలింపు చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. లిక్కర్ స్కాం గురించి తనకు చాలా విషయాలు తెలుసునని, విచారణకు పిలిచి అడిగితే తనకు తెలిసిన విషయాలు చెబుతానని విజయసాయిరెడ్డి కొన్ని రోజుల కిందటే స్పష్టం చేశారు.
2 వేల స్థానానికి పడిపోయా..
విచారణకు హాజరవుతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్ గురించి ఒక్క మాట గురించి మాట్లాడటం లేదు. ఇప్పటివరకూ మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా విచారణలో ఒక్కమాట కూాడా మాట్లాడకపోవడం విశేషం. అయితే పార్టీలో రెండో స్థానంలో ఉన్న తాను వైసీపీ లోని కోటరి కారణంగా జగన్ దృష్టిలో 2వేల స్థానానికి పడిపోయానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం అదేనన్నారు.