YSRCP inside :  వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ ..పాలనా వ్యవహారలతో పాటు పార్టీ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రతీ రోజూ పార్టీ కోసం సమయం కేటాయించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్‌ టీం ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీతో కలిసి పని చేస్తోంది. ఆ టీంను రిషిరాజ్ లీడ్ చేస్తున్నారు. ఆయన  ఎప్పటికప్పుడు నివేదికలను నేరుగా సీఎం జగన్‌కు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను పరిశీలించి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 


గడప గడపకూ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షలు !


సీఎం జగన్ ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని పంపించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఆ ప్రకారం ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జులు ఇంటింటికి వెళ్తున్నారు. తాము చేసిన మేలు గురించి వివరిస్తున్నారు. అయితే ఆ కార్యక్రమం సమయంలో  వెల్లడవుతున్న అసంతృప్తి ..  ఇతర సమస్యల విషయంలోనూ జగన్ సీరియస్‌గా స్పందిస్తున్నారు. సచివాలయానికి రూ. ఇరవై లక్షల చొప్పున కేటాయించారు. ఇలా వెళ్లడం వల్ల ప్రజలు ప్రభుత్వం తమ మేలు చేయడానికే ఉందన్న భావనకు వస్తారని నమ్ముతున్నారు. అయితే కొంత మంది నేతలు సరిగ్గా పని చేయడంలేదని.. ఇంటింటికి వెళ్లడం లేదన్న అసంతృప్తిలో జగన్ ఉన్నారు. అందుకే మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. 


ప్రతి నియోజకవర్గానికి ఓ పరిశీలకుని నియామకం !


పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారే ఇంచార్జులు ఉన్నారు. లేని చోట్ల ఓడిన వారు కొంత మంది..  కొత్తగా నియమితులైన వారు కొంత మంది ఇంచార్జులుగా ఉన్నారు. తాజాగా నియోజకవర్గాలకు పరిశీలకుడ్ని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు.  ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించాలని.. నిర్ణయించి ఇప్పటికే జాబితారె డీ చేశారు.  ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటారు.   తుది జాబితా సిద్ధమవుతోందని వారం, పది రోజుల్లో ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిశీలకుడు ఏం చేస్తాడన్నది మాత్రం వైసీపీ వర్గాలు క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే.. ఇంచార్జిని ఐ ప్యాక్ టీం ఫాలో చేస్తోంది. వారేం చేస్తున్నారో పరిశీలిస్తోంది. నివేదికలిస్తోంది. అందుకే  జగన్... ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడం లేదని కొంత మందిపై మండి పడుతున్నారు. అయితే ఈ సారి నియమంచబోయే పరిశీలకులు.. రాజకీయ నేతలేనని అదే నియోజకవర్గానికి చెందిన వారై ఉంటారని చెబుతున్నారు.  


పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మార్పు  !


ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఈ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనను తప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి చేతికి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగాన్ని అప్పగించారు. ఈ నిర్ణయం కూడా వైఎస్ఆర్‌సీపీలో ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎఫెక్టివ్‌గా పని చేయడం లేదని ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టి జిల్లాకు ఓ కన్వీనర్ ను కో కన్వీనర్లను నియమించారు. మరికొంత మంది సోషల్ మీడియా వారియర్స్‌ను కూడా రెడీ చేశారు. ఈ క్రమంలో సజ్జల తన కుమారుడికి పదవి వచ్చేలా చూసుకోవడంతో ఆ విభాగం కూడా ఇక ముందు మరితం క్రియాశీలకంగా మారుతుందని భావిస్తున్నారు. 


మరికొన్ని కీలక మార్పులు చేయనున్న జగన్ ?


ఎమ్మెల్యేల్లో దాదాపుగా 70 మంది వరకూ ఈ సారి టిక్కెట్లు ఉండవని వైఎస్ఆర్‌సీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మరికొన్ని కీలక మార్పులను పార్టీలో జగన్ చేయబోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే స్పష్టమైన మార్పులు కనిపిస్తూండగా.. వ్యవస్థలోనే కొత్తదనాన్ని నింపాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీం రొటీన్‌గా పని చేస్తోందని ..  మరోసారి అధికారాన్ని దక్కించుకునేలా ... కొత్త టీంతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.