Etela Rajender Suspension: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్

MLA Etela Rajender Suspended: బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన చేయడంతో పాటు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనందుకు ఈటెలపై సస్పెన్షన్ వేటు వేశారు.

Continues below advertisement

MLA Etela Rajender Suspended: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల స్పీకర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేయడంతో పాటు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనందుకు ఈటెల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 8వ సెషన్ మూడవ మీటింగ్ ముగిసే వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటలపై సస్పెన్షన్ కొనసాగుతుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని ఈ నెల 6న మర మనిషి అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కామెంట్ చేశారు.

Continues below advertisement

క్షమాపణ కోరకపోవడంతో ఈటలపై వేటు 
స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. ఈటల రాజేందర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇదే విషయాన్ని మంత్రి సభలో ప్రస్తావించారు. వయసులో పెద్ద వ్యక్తి, సీనియర్ అయినటువంటి నేతపై అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తాను సెప్టెంబర్ 6వ తేదీనే ఈటల రాజేందర్ ను కోరినట్లు చెప్పారు. గౌరవ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరకపోవడంతో స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరడంతో ఈటలను అసెంబ్లీ నుంచి స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు.

అవకాశం దొరికినప్పుడల్లా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులను ఇరుకున పెడుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారు. తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటలను సభలో లేకుండా చూసేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బడ్జెట్ సమావేశాల్లోనూ సస్పెండ్..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురిని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేయడం తెలిసిందే. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురు సభ్యులను స‌స్పెండ్ చేయడంతో సభలో బీజేపీ నేతలకు ప్రాతినిథ్యం దక్కలేదు. ట్రిపుల్ ఆర్ (రఘునందన్, రాజా సింగ్, రాజేందర్) సినిమా చూపిస్తారని బండి సంజయ్ ఎన్నో ఆశలు పెట్టుకోగా, బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులను స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు.

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు 
తెలంగాణ శాసన సభ, శాసన మండలి వర్షాల కాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మూడో రోజు శాసనసభలో నేడు కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చింబోతున్నట్లు సమాచారం. మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దు అయ్యాయి. ఉభయ సభల ప్రారంభం కాగానే కేంద్రం విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం వాటిపై సంపూర్ణంగా చర్చించి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత శాసన సభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. అనంతరం ఎఫ్ఆర్బీఏ చట్టం అమలులో కేంద్ర ద్వంద్వ విధానం - రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉభయ సభల్లో రెండు స్వల్ప కాలిక చర్యలు జరుపుతారు. రాత్రి వరకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. 

Continues below advertisement