Telanagana Assembly Sessions: తెలంగాణ శాసన సభ, శాసన మండలి వర్షాల కాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. చివరి రోజు అయిన మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చింబోతున్నట్లు సమాచాం. మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దు అయ్యాయి. ఉభయ సభల ప్రారంభం కాగానే కేంద్రం విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం వాటిపై సంపూర్ణంగా చర్చించి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత శాసన సభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. అనంతరం ఎఫ్ఆర్బీఏ చట్టం అమలులో కేంద్ర ద్వంద్వ విధానం - రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉభయ సభల్లో రెండు స్వల్ప కాలిక చర్యలు జరుపుతారు. రాత్రి వరకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.
తొలిసారిగా వైస్ ఛాన్స్‌లర్ కాబోతున్న సీఎం..!
సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే వర్సిటీకి ప్రత్యేక చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయానికి సీఎం కేసీఆర్ యే ఛాన్సలర్ గా ఉండబోతున్నారు. తొలి సారిగా సీఎం కులపతి కాబోతున్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు-2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టారు. తెలంగాణ వస్తు సేవల పన్ను బిల్లు - 2022, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్యు నిపుణుల వయోపరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లును ఆయా మంత్రులు ప్రవేశ పెట్టారు. శాసన సభలో ఆమోదం అనంతరం మండలిలో బిల్లులపై చర్చించనున్నారు.
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం..
తెలంగాణ శాసనసభ రెండో రోజు చర్చల్లో భాగంగా సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై సోమవారం (సెప్టెంబరు 12) శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త విద్యుత్ విధానాలను పూర్తిగా వ్యతిరేకించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, దయచేసి వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశంలోని పేద రైతులు, ఎస్సీ, ఎస్టీల కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని అప్పీల్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు్ల్లోని సంస్కరణలు అమలైతే ఆ శాఖ ప్రైవేటు పరం కానుందని, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల తరహాలో విద్యుత్ శాఖలోని ఉద్యోగులంతా రోడ్డున పడతారని హెచ్చరించారు.
విద్యుత్ సవరణ బిల్లుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు..
సెప్టెంబర్ 15, 2020లో తెలంగాణ అసెంబ్లీ.. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై తమ నిర్ణయాన్ని తెలిపిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సోమవారం జరిగిన అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని సభలో మాట్లాడారు దుబ్బాక ఎమ్మెల్యే. సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు, కేంద్రం బిల్లుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని పదే పదే మంత్రులు చెబుతున్నారు. 17 ఏప్రిల్ 2020లో సెక్షన్ 65 ప్రకారం .. రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా, బడుగు, బలహీన వర్గాలకు సబ్సిడీ ఎత్తివేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.