Etela Rajender Comments At Telangana Assembly: స్పీకర్ తనకు తండ్రి లాంటి వ్యక్తి అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయితే సభలో మాట్లాడే హక్కు లేదా అని ఈటల ప్రశ్నించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే సభలో కొనసాగవచ్చునని, ఈటలకు సూచించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సభలో ఉండటం కంటే బయటకు వెళ్లి రచ్చ చేయాలనే ఆలోచనతో వచ్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఆరోపించారు. తనను సభలో కొనసాగించాలనుకుంటున్నారా, బయటకు పంపించాలని ముందే నిర్ణయించుకున్నారా అంటూ ఈటల గట్టిగా నిలదీశారు.


ఇదెక్కడి కథ, ఇవేం బెదిరింపులు
సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సైతం ఎమ్మెల్యే ఈటలను కోరారు. తండ్రిగా సంభోదించారని, చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరగా క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించారు. తనకు గౌరవ ఉందా లేదా మీరు ఎలా డిసైడ్ చేస్తారంటూ వాదనకు దిగారు ఈటల. ఇదెక్కడి కథ, ఇవేం బెదిరింపులు.. మా హక్కులు కాపాడతరా లేదా అని ఈటల సభలో అడిగారు. బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడే హక్కు లేదా అని స్పీకర్ పోచారంను ప్రశ్నించారు. దాంతో ఈటలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ పోచారం.. బీజేపీ ఎమ్మెల్యే ఈటలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 8వ సెషన్ మూడో మీటింగ్ ముగిసేవరకు ఈటలను సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.


ఈటలను బలవంతంగా తరలించిన పోలీసులు
సభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సభ నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరించారు. తమ హక్కులు కాలరాస్తున్నారంటూ వాదనకు దిగడంతో బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుంచి తరలించారు. బానిసలా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై ఆగ్రహం చేశారు. మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. సంవత్సర కాలం నుంచి నాపై కుట్ర చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించనని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడను అని ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు బీజేపీ నేతలను సభలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.


Also Read: Etela Rajender Suspension: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్ 


క్షమాపణ కోరకపోవడంతో ఈటలపై వేటు 
స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. ఈటల రాజేందర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇదే విషయాన్ని మంత్రి సభలో ప్రస్తావించారు. వయసులో పెద్ద వ్యక్తి, సీనియర్ అయినటువంటి నేతపై అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తాను సెప్టెంబర్ 6వ తేదీనే ఈటల రాజేందర్ ను కోరినట్లు చెప్పారు. గౌరవ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరకపోవడంతో స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరడంతో ఈటలను అసెంబ్లీ నుంచి స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు.