Defamation of High Court Judges: అమరావతి: జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో తాజాగా ఏడుగురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఇందులో ఓ మహిళ ఉన్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం సోమవారం రాత్రి విజయవాడలోని సీబీఐ కేసులను విచారించే ఐదో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఇంట్లో నిందితులను హాజరుపరిచారు. నంబూరు గ్రామానికి చెందిన పి.సుమ, భద్రాద్రి కొత్తగూడేం వాసి రంగారావు, నరసరావుపేటకు చెందిన ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కుంచనపల్లికి చెందిన అశోక్‌కుమార్‌ రెడ్డి, ప్రకాశం జిల్లా గురజపేటకు చెందిన గంజికుంట మల్లికార్జునరావు, పొదిలి వాసి రామాంజనేయులురెడ్డి, హైదరాబాద్‌ కు చెందిన చొక్కా రవీంద్రలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేసింది సీబీఐ.
విచారణకు సహకరించడం లేదు: సీబీఐ
నిందితులు ఉద్దేశపూర్వకంగానే జడ్జీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సీబీఐ కోర్టులో సమర్పించిన రిమాండ్‌ నివేదికలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హైకోర్టు జడ్జీలను దూషించిన కేసులో పిలిపించి ప్రశ్నించినా విచారణకు సహకరించడం లేదని, నిందితులను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. సీబీఐ అధికారుల వాదనను పరిగణనలోకి తీసుకున్న ఐదో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం మహిళ సహా ఏడుగుర్ని విజయవాడలోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టడానికి ముందు వీరందరికి ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు చేపించారు.
హైదరాబాద్‌‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు..
ఈ కేసులో నిందితుల వద్ద నుంచి సీబీఐ అధికారులు కొన్ని ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్, డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌ను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు సీబీఐ అధికారులు. ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తులను కించపరచడం వెనుక పెద్ద కుట్ర ఉందని సీబీఐ తమ నివేదికలో వెల్లడించింది. ఈ కారణంగా నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తికి సీబీఐ అధికారులు విన్నవించారు.


సీబీఐ అధికారులు వస్తున్నారని ఒకరు పరార్..
జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు అన్ని ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో విచారణకు విజయవాడకు రావాలని మారుతీరెడ్డికి రెండుసార్లు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావడం లేదని సీబీఐ అధికారులు సోమవారం హిందూపురానికి వచ్చారు. ముందస్తు సమాచారం అందడంతో నిందితుడైన వైసీపీ నేత, 21వ వార్డు కౌన్సిలర్‌ మారుతీరెడ్డి పరారయ్యారు. దాంతో సీబీఐ అధికారులు ఆయన భార్యతో వాంగ్మూలం తీసుకున్నారు. హిందూపురానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌ సీఐ వెంకటేశ్వర్లును కలిశారు. స్థానిక పోలీసులతో కలిసి మారుతీరెడ్డి ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన పరారైనట్లు తెలసుకున్నారు. మారుతీరెడ్డి భార్యతో మాట్లాడి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు.


Also Read: భాషపై కంట్రోల్ కోల్పోయిన ఏపీ రాజకీయ పార్టీలు ! ప్రజలు హర్షిస్తారా ? శిక్షిస్తారా?


Also Read: TDP Politics : కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్, భవిష్యత్ కార్యాచరణపై రేపు కీలక సమావేశం!