Political Language :  రాజకీయాల్లో హుందాతనం ఆశించడం అంటే గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలను వేరుకున్నట్లే. రాజకీయ నేతల్లో కనీస విలువలు లేవు. తాగుబోతులు తిట్టుకున్నట్లుగా తిట్టుకుంటారని .. మీడియా ముందు ప్రజలు చూస్తూండగా ప్రత్యర్థి పార్టీ నేతల్ని.. వారి కుటుంబాల్ని దారుణంగా తిడతారని మాత్రం ఊహించలేం. ఇప్పుడు అదీ జరిగిపోయింది. మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె నారా భవనేశ్వరపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ప్రతీ చోటా ఇప్పుడు కొడాలి నాని మాటల గురించే చర్చ జరుగుతోంది. 


ఓ మహిళను ఎవరూ అనకూడని మాటలన్న కొడాలి నాని !


చంద్రబాబు వైఎస్ఆర్‌సీపీ రాజకీయ ప్రత్యర్థి. ఆ పార్టీ నేతలకు వ్యక్తిగత శత్రువు. లోకేష్ కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యర్థి అనుకున్న వాళ్లకు ప్రత్యర్థి.. శత్రువు అనుకున్నవాళ్లకి శత్రువు. కానీ వారి ఇతర కుటుంబసభ్యులు రాజకీయాల్లో లేరు. అయితే  కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌లను మానసికంగా దెబ్బకొట్టాలనుకుంటున్నారో మరో వ్యూహమో కానీ.. ఇంట్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి వ్యాఖ్యలకు  తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ దాడి తగ్గడం లేదు. కొడాలి నాని అంత కంటే దారుణణమైన భాషతో మరోసారి విమర్శలు గుప్పించారు . ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయితే మాత్రం ఇంట్లో మహిళల్ని ఇలా తిడతారా అని అనే చర్చ అంతటా జరుగుతోంది. 


రివర్స్ లో అంత కంటే దారుణమైన భాష వాడుతున్న టీడీపీ నేతలు ! 


నారా భవనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె..  చంద్రబాబు సతీమణి. అయినంత మాత్రాన ఇష్టారాజ్యాంగా ఆమె వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా వ్యాఖ్యానిస్తూ ...ఆమెను మానసికంగా వేధించడం ఎలా సబబని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా కొడాలి నానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. పలువురు టీడీపీ నేతలు కొడాలి నానితో పాటు ఆయన కుటుంబాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గౌరవంగా చెప్పుకోవాలంటే అవి విమర్శలు.. నిజానికి అని బండ బూతులు. నోరంటే చాలు ఎలాంటి మాటలైనా మాట్లాడవచ్చని.. తాము నిరూపిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.  నిరూపిస్తున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ నేతల్ని సీఎం  జగన్ ప్రోత్సహిస్తున్నారని విమర్శలు !


ఏపీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ భాష దిగజారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. పరిధి దాటుతున్న వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎప్పుడూ నిలువరించకపోగా పదవులతో ప్రోత్సహించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పలువురు నేతలకు అదే అర్హతగా పదవులు లభించాయన్న విశ్లేషణలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కేబినెట్  మీటింగ్‌లో గట్టిగా ఎదురుదాడి చేయడం లేదని సీఎం సీరియస్ అయ్యారని ప్రచారం జరిగిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో కొంత మంది నేతలు పరిధి దాటిపోతున్నారు. వరుసగా చంద్రబాబును .. ఆయన కుటుంబసభ్యుల్ని విమర్శల పేరుతో బూతుల దాడి చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. 


ఒకరినొకరు తిట్టుకోవడమే రాజకీయం అయితే పతనం ఎక్కడి వరకు ?


ఇవాళ తిట్టించుకున్న వాళ్లు రేపు తిట్టకపోతే తాము చేతకాని వాళ్లం అనే ముద్ర పడుతుందని అంతకు రెట్టింపు ఇస్తారు. దాని వల్ల ఏం జరుగుతుంది…? ఈ బూతుల ప్రవాహం కంటిన్యూ అవుతుంది.  అది  రాజకీయానికి ఏ మాత్రం మేలు చేయదు. రాజకీయ వ్యవస్థ విలువనే దిగజారుస్తుంది. ఇలాంటి నేతల్ని ప్రజలు సహిస్తారా? శిక్షిస్తారా అన్నది మళ్లీ వారికి ఓటు వినియోగించుకునే చాన్స్ వచ్చినప్పుడే తేలుతుంది. తాము ఎన్నుకునే నేతలు అలాంటి వాళ్లు కాదని.. ఎన్నికన వాళ్లే నిరూపించాల్సి ఉంది. దురదృష్టవశాత్తూ అదే జరగడం లేదు.