Fish Dehydrator: ఏడు చేపల కథలో.. చేపా చేపా ఎందుకు ఎండలేదంటే.. గడ్డిపోచలు అడ్డమొచ్చాయని చెబుతుందని చదువుకున్నాం. అది కథే అయినా, ఇకపై అలాంటి అవాంతరాలు లేకుండా చేపల్ని ఎండబెట్టేందుకు ఓ మిషన్ అందుబాటులోకి వచ్చింది. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జీవుల్ని ఎండబెట్టి నిల్వ చేసుకునే మిషన్ ఇది. సహజంగా సూర్య రశ్మితో చేపల్ని, రొయ్యల్ని ఎండబెట్టాలంటే రోజుల తరబడి వాటిని ఎండలో ఉంచాలి. ఎండిన తర్వాత వాటికి అంటుకున్న ఇసుక ఓ పట్టాన పోదు, వాటిని తిరిగి శుభ్రం చేసుకోవాలి. కానీ డి హుమిడిఫయర్ అనే ఈ మిషన్ (Fish Drying Machine) ద్వారా అలాంటి ఇబ్బందుల్లేకుండా చేపల్ని ఎండబెట్టుకోవచ్చు.


వారం రోజుల పని 8 గంటల్లోనే..  
సహజంగా చేపల్ని ఎండబెట్టాలంటే, వారం రోజులపాటు ఎండలో ఉంచాలి. కొన్నింటిని అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుభ్రపరిచి మార్కెట్లోకి తెచ్చి అమ్ముతుంటారు. కానీ డి హుమిడిఫయర్ల ద్వారా చేపల్ని 8 గంటల నుంచి గరిష్టంగా 24 గంటల్లోనే ఎండబెట్టొచ్చు. వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు కూడా ఉండవు. ఇలా ఎండినవాటిని వాక్యూమ్ ప్యాకేజింగ్ ద్వారా ఎక్కువ రోజులు, ఏడాదిపాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. 




చేపలు, రొయ్యలు ఎండబెట్టాలంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడమే ఇప్పటి వరకూ మనకు అలవాటు. కానీ విదేశాల్లో మాత్రం చేపలు, రొయ్యలను ఎండబెట్టడానికి హుమిడిఫయర్లను విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నాలటీ ఇటీవలే భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన సంస్థ ఈ హుమిడిఫయర్లను తయారు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వీటిని మత్స్యకారులకు అందిస్తోంది. నెల్లూరులో ఇటీవల జరిగిన మత్స్యకార సదస్సులో ఈ హుమిడిఫయర్లకోసం ప్రత్యేకంగా ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. 


కరెంటుతో పనిచేసే ఈ హుమిడిఫయర్లు పదార్థాల్లో ఉన్న తేమను హరించివేస్తాయి. వాటిని ఎండబెడతాయి. ఇక్కడ ఎండబెట్టే పద్ధతి వేరేగా ఉంటుంది. ఓజోన్ సాయంతో హుమిడిఫయర్లలో పదార్థాలను ఎండబెడతామంటున్నారు. వీటి ద్వారా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయని, ఏడాది వరకు పదార్థాలు చెడిపోకుండా ఉంటాయని చెబుతున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు జగన్ మోహన్ రావు. 


విదేశాల్లో ఎక్కువగా హుమిడిఫయర్లను ఉపయోగిస్తుంటారు. పండ్లను ఇలా ఎండబెడుతుంటారు. యాపిల్స్ ని కూడా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకుని అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు. భారత్ లో మాత్రం ప్రస్తుతానికి ఇలాంటి హుమిడిఫయర్ల వాడకం ఇంకా ఊపందుకోలేదు.




దక్షిణ భారత్ లో చెన్నై కేంద్రంగా వీటిని వినియోగంలోకి తెస్తున్నట్టు చెబుతున్నారు. సీ ఫుడ్స్ మాత్రమే కాకుండా పండ్లు, ఎండు మిర్చి వంటి వాటిని కూడా హమిడిఫయర్ల ద్వారా తేమను తీసేసి ఎండబెడతారు. ఆ తర్వాత వాటిని వ్యాక్యూమ్ ప్యాకింగ్ ద్వారా భద్రపరిస్తే.. ఏడాది వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని చెబుతున్నారు. 




భారత్ లో డిహుమిడిఫయర్ల వాడకం తక్కువగానే ఉంది. విదేశాల్లో మాత్రం వీటిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం భారత్ లో కూడా వీటిని మత్స్యకారులకు పరిచయం చేస్తోంది ప్రభుత్వం. సబ్సిడీపై వీటిని అందిస్తోంది. తక్కువ విద్యుత్ ఖర్చుతోనే వీటిని ఉపయోగించుకోవచ్చు. లక్ష నుంచి 6 లక్షల వరకు వీటి ధర ఉంటుంది.