YSRCP MP Vijayasai Reddy:
తిరుపతిలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు పార్టీ కీలక నేతలు హాజరుకాకపోవడం, సీఎం జగన్‌కు నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది అని ఊహాగానాలు కూడా తోడవడంతో పాటు పార్టీ అనుబంధ సంస్థల ఇంచార్జ్‌గా మాత్రమే విజయసాయిరెడ్డిని నియమించడంతో ఆ ఎంపీ పని అయిపొయింది అనే చర్చ సైతం మొదలైంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో సైతం విజయ సాయిరెడ్డికి పెద్ద ప్రాధాన్యత దక్కలేదు అని పార్టీలోనే కొందరు అభిప్రాయపడ్డారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తనను అనుబంధ సంస్థల ఇంచార్జ్ గా మాత్రమే నియమించడంపై సంయమనంగానే స్పందిస్తూ పార్టీ అధినేత జగన్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించడమే తన పని అని చెప్పారు. కిఅయితే రాత్రికి రాత్రే తాడేపల్లికి వెళ్లి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చినట్టు సమాచారం.
తనను కలిసిన విజయసాయిరెడ్డి పార్టీలో ప్రస్తుత పరిణామాలపై చర్చిండంతో పాటు కొన్ని అంశాలపై ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందారో లేక ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారో గానీ ఎంపీకి మళ్లీ కీలక బాధ్యతలు దక్కాయి. రాష్ట్రంలో రీజనల్ కో -ఆర్డినేటర్లతో పాటు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు సైతం విజయసాయిరెడ్డికి అప్పగిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంతకుముందు ఆ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)కి ఎమ్మెల్యేల -మీడియా కోర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.
వారికి షాక్ ఇచ్చినట్లేనా !
ఇన్నాళ్లూ విశాఖ ప్రాంతంలో పార్టీ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డిని ఇటీవల పదవుల నుంచి తప్పించి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిలను నియమించారు. అలాగే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా విడదల రజనికి బాధ్యతలు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి ఇక విశాఖకు దూరం కావడం తథ్యం అనుకున్నారు కొందరు. పైగా విశాఖ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ఇక్కడ మొత్తం తామే కీలకం అనే భావన ఆయా నేతల వర్గాలు భావించాయని ప్రచారం జరిగింది. అదే సమయంలో విజయసాయిరెడ్డి మళ్ళీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో ఆయనపై దుష్ప్రచారం చేసిన వారికి షాక్ ఇచ్చినట్టేనని అంటున్నారు విశ్లేషకులు .
Also Read: Nellore Politics : నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టం, అనిల్ కుమార్-కాకాణి గోవర్థన్ భేటీ