Sri Sarada Peetham: ఏపీ సరికొత్త రాజకీయ కేంద్రంగా విశాఖలోని శారదాపీఠం మారనుందా అంటే అవునని చెప్పేలా ఇక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మంత్రి రోజా, మరో కొత్త మంత్రి విడదల రజని కావొచ్చు.. వీరు పదవీ బాధ్యతలు స్వీకరించారో లేదో స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతకు చేరుకున్నారు. స్థానిక మంత్రి గుడివాడ అమర్ నాథ్ అయితే అంతకంటే ముందే శారదా పీఠంలో తన హాజరు వేయించుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమితంగా విలువిస్తున్న నేపథ్యంలో విశాఖలోని శారదా పీఠానికి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది.
సాధారణంగా మంత్రులకే సీఎం వద్ద అపాయింట్మెంట్ దొరకడం అంత సులభం కాదనే పేరుంది. దానితో తమ కష్టాలూ, విజ్ఞప్తులూ విశాఖ వచ్చి స్వామీజీకి చెప్పుకుంటే ఆయనే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళతారని వైఎస్సార్‌సీపీ నేతలలో నమ్మకం ఏర్పడుతోంది. సిఫార్సులు కావొచ్చు. మరే పనైనా కావొచ్చు. ఒక్కసారి శారదా పీఠానికి వచ్చి స్వరూపానందేంద్ర స్వామీజీని కలిస్తే చాలు, పనైపోతుంది అనే నమ్మకం కలగడంతో అధికారులు, మంత్రులు, ఇతర నేతలు చలో శారదా పీఠం అంటున్నారు.
క్యూ కట్టిన మంత్రులు :
ఏపీ కొత్త మంత్రివర్గంలో సమాచారశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పౌర సరఫరాలశాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మత్స్యకారశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి రోజా, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ముత్యాల నాయుడు, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని ఇప్పటివరకూ విశాఖ శారదా పీఠానికి చేరుకుని స్వరూపానందేంద్ర స్వామి కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నవారిలో ఉన్నారు.
స్వామీజీ ని కలిశాకే మంత్రి పదవి
ఒక మహిళా మంత్రికి స్వామీజీ ఆశీస్సులతోనే మంత్రి పదవి వచ్చిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి కేబినెట్లోనే మంత్రి పదవి ఖరారు అనుకున్నప్పటికీ రకరకాల సమీకరణాల నేపథ్యంలో అది కాస్తా రాలేదు. ఏపీ తాజా క్యాబినెట్‌లో ఆమెకు మంత్రిపదవి ఇవ్వడాన్ని ఆమె నియోజకవర్గ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారట. అయితే ఆమెకు స్వామీజీ ఆశీస్సులతో మంత్రి పదవి దక్కింది. అయితే తనకు అంత ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కలేదని విశాఖ వచ్చి స్వామీజీకి మొర పెట్టుకోగా ఈ సారికి అలాగే కొనసాగాలని చెప్పినట్టు సమాచారం .
మిగిలిన పీఠాలకు భిన్నంగా శారదా పీఠం
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పీఠాలతో పోలిస్తే శారదా పీఠం విభిన్నమనే చెప్పాలి. ఇక్కడి రాజ శ్యామల అమ్మవారు చాలా శక్తివంతమైందని ఆశ్రమ వర్గాలు చెబుతుంటాయి. అందుకే ఆమె దర్శనం కోసం ఇక్కడకు వస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే స్వామీ స్వరూపానంద చెప్పిన పనులన్నీ ఏపీ ప్రభుత్వంలో జరిగిపోతున్నాయని వినికిడి. దేవాదాయ శాఖలో అయితే స్వామీజీ మాటే వేదం. సింహాచలం కావొచ్చు, రుషికొండ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయినా.. స్వామీజీ తెలిపిన తరువాతే ఏ కార్యక్రమం అయినా అన్నట్టు పరిస్థితి ఉందని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు.
స్వామీజీ అభిమతం మేరకు ఈ మధ్యే భీమిలిలో ప్రశాంత వాతావరణం మధ్య భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇంతకు ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొందరు స్వామీజీలు రాజకీయంగా ప్రభావం చూపే ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో చిన జీయర్ స్వామీ కావొచ్చు, పరిపూర్ణానంద స్వామీజీలు ప్రభావం చూపగల వ్యక్తులు. అయితే ఏపీలో మాత్రం స్వరూపానంద స్వామీజీ లెక్కే వేరు అన్నట్టు పరిస్థితి ఉంది. రాజకీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ఒక రాష్ట్ర ప్రభుత్వంపై స్వామీజీ ప్రభావం ఈ స్థాయిలో ఉండటం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని విశాఖతో పాటు ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ టాక్ వినిపిస్తోంది.