Nellore Politics : నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎట్టకేలకు కలుసుకున్నారు. ఇటీవల ఫ్లెక్సీల వివాదం, ఒకేరోజు పోటా పోటీ సభలతో అనిల్, కాకాణి వర్గాల మధ్య వాతావరణం వేడెక్కింది. సీఎం జగన్ వద్ద పంచాయితీ జరిగినా ఇద్దరూ ఎవరికి వారే విడివిడిగా మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారే కానీ, ఒక్కటిగా కనపడిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నెల్లూరు ఇస్కాన్ సిటీ సమీపంలోని అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి కాకాణి గోవర్థన్ రెడ్డి వెళ్లి పలకరించారు. ఒకరికొకరు శాలువాలు కప్పుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. 


వివాదం సమసిపోయినట్టేనా?


ఆయన నాపై చూపించిన ప్రేమను అంతకు రెట్టింపు ఇస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైనట్టు చెప్పుకోవాలి. ఆ తర్వాత నెల్లూరు నగరంలో కాకాణి ఫ్లెక్సీలు తొలగించడంతో మరింత ముదిరింది. చివరకు కాకాణి మంత్రిగా జిల్లాకు వచ్చే రోజే అనిల్ కూడా సభ పెట్టడం, ఆ తర్వాత ఆనం కుటుంబం కాకాణికి సన్మానం చేసే రోజు కూడా ఫ్లెక్సీలు తొలగించిన ఘటనలు జరగడంతో ఒక్కసారిగా నెల్లూరులో వాతావరణం వేడెక్కింది. చివరకు సీఎం జగన్ ఇద్దర్నీ పిలిపించుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య గొడవ జరిగినట్టు, వారి మధ్య సీఎం జగన్ పంచాయితీ పెట్టిన దాఖలాలు లేవు, కానీ తొలిసారిగా కాకాణి, అనిల్ మధ్య జగన్ అలాంటి సయోధ్య కుదిర్చారు. దాని ఫలితంగా మంగళవారం ఇద్దరూ నెల్లూరులో కలిసిపోయారు. 


అందరివాడుగా కాకాణి


నెల్లూరు జిల్లాలో తొలి విడత ఇద్దరికి మంత్రి పదవులిచ్చారు జగన్. అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా బీసీ కోటాలో మంత్రి పదవికి ఎంపిక కాగా.. మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఆ తర్వాత గౌతమ్ రెడ్డి అకాల మరణం, మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో అనిల్ పదవి కోల్పోవడంతో జిల్లాలో కొత్తగా కాకాణికి పదవి లభించింది. కాకాణికి పదవి రావడంతో సీనియర్లు, ఇతర ఆశావహులు కాస్త ఉడుక్కున్న మాట వాస్తవమే. కానీ తర్వాత అందరూ కలసిపోయారు. ఒక్కొక్కరూ కాకాణితో వచ్చి కలిశారు. స్వయంగా కాకాణి కూడా కొంతమంది ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారితో కలసిపోయారు. చివరిగా అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరే మిగిలిపోయారు. ఆయనను కూడా ఇప్పుడు మంత్రి కాకాణి కలవడంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ వివాదం టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. అందరూ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం పనిచేస్తామని చెబుతున్నారు. 


గెలుపెవరిది?


మాజీ మంత్రి అనిల్, తాజా మంత్రి కాకాణి ఇద్దరూ కొన్నిరోజులపాటు బెట్టు చేశారు. ఒకరి పేరు ఒకరు నేరుగా ప్రస్తావించకపోయినా విభేదాలు మాత్రం బయటపడ్డాయి. చివరకు కాకాణి, అనిల్ ఇద్దరూ సీఎం జగన్ చొరవతో సర్దుకుపోయారు. పార్టీ బాగుకోసం ఒక్కటయ్యారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కలిసిపోయారు. అయితే పూర్తి స్థాయిలో ఇద్దరూ ప్యాచప్ అయ్యారా, లేక వివాదాలు ఇంకా మిగిలే ఉన్నాయా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.