Plastic Ban in Vizag: పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. వైజాగ్‌లో ప్లాస్టిక్ కనిపించకూడదని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగానే ప్రజలను, వ్యాపారస్థులను అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు కనిపించ కూడదని భావిస్తున్నారు. జూట్ సంచులు.. పేపర్ కవర్లు మాత్రమే వాడాలని సూచించారు.
జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. వైజాగ్‌లో ప్లాస్టిక్ వాడినట్టు, అమ్మినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం (జూన్ 5) నుంచి వైజాగ్‌లో ప్లాస్టిక్ బ్యాన్ విధిస్తున్నట్టు వివరించారు. టూరిస్టు ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ వాడకం నిషేధమని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం విదించినందుకు ఎలాంటివి వాడాలనే అంశంపై ప్రజలకు ఆవగాహన కల్పిస్తున్నట్టు కూడా జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. ఫంక్షన్లు, ఇతర అవసరాల కోసం విస్తరాకులు, మోదుగ ఆకులతో చేసిన ప్లేట్లనే వాడదామంటూ పిలుపునిచ్చారు. నిత్యవసరాల కోసం గుడ్డ సంచులనే ప్రజలు వాడాలి సూచిస్తున్నారు.
వారికి రూ.5000 జరిమానా
పర్యాటక ప్రాంతాల్లో వాటర్ బాటిల్స్ లాంటివి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు లక్ష్మీషా. ఎవరైనా వ్యాపారులు ప్లాస్టిక్ కవర్స్ అమ్మినట్టు గుర్తిస్తే 5000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ పారవేసే వారికి రూ.500 జరిమానా విధిస్తామని, టూరిస్టులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ బ్యాన్ పై అవగాహన పెంచేందుకు విశాఖ ఆర్కే బీచ్‌లో అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు.
ఈ బాధ్యత అందరిదీ.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్
రాష్ట్ర ప్రజలందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా విశాఖపట్నంలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ప్రకృతిని పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని మంత్రి కోరారు. గ్రీన్ రెవల్యూషన్‌కు ఏపీ నాంది పలికిందన్నారు. అంతర్జాతీయ వేదికగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు.
Also Read: Adimulapu Suresh Health: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు యాంజియోప్లాస్టీ - ఫోన్‌లో పరామర్శించిన సీఎం జగన్