అమరావతి: ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. మే నెల 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆదిమూలపు సురేష్‌కు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి యాంజియోప్లాస్టి నిర్వహించారు వైద్యులు.
మంత్రి సురేష్‌ను పరామర్శించిన సీఎం జగన్..
గత నెల చివర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఆదిమూలపు సురేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు సభల్లో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజలకు ప్రయోజనాలను వివరించారు. ఈ క్రమంలో ఆయన కాస్త అవస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు బుధవారం మంత్రికి స్టెంట్ వేశారు. ఆదిమూలపు సురేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి మంత్రిని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.
యాంజియోప్లాస్టి నిర్వహించిన వైద్యులు శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆదిమూలపు సురేష్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.