సినిమా ప్రచారానికి సంబంధించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సినిమా హీరోలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలని అన్నారు. గోపిచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‘సినిమా ఫంక్షన్స్‌కు, ఈవెంట్స్‌కు వెళ్లడం గోపిచంద్‌కి పెద్దగా ఇష్టం ఉండదు. తనకి కాస్త సిగ్గు కూడా ఎక్కువే. ఈ ప్రెస్‌మీట్‌కి గోపిచంద్‌ని కచ్చింతంగా రప్పించండి అని చెప్పాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి హీరోలు కూడా రావాలి. ఈ మధ్య ఓ పెద్ద హీరో స్టేజ్‌ మీద డ్యాన్స్‌ చేసి తన సినిమాను ప్రమోట్‌ చేసుకున్నారు. అలా చేయాల్సిన పరిస్థతి వచ్చింది.’


‘సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోల మీద కూడా ఉంది. ప్రస్తుతం ఓటీటీలో చాలా కంటెంట్‌ అందుబాటులో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులను ధియేటర్స్‌కు రావాలంటే.. హీరో, హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలి. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా హీరో, హీరోయిన్లు తమ సినిమాను ప్రచారం చేసుకోవాలి. నిర్మాతలను చూసి ప్రేక్షకులను థియేటర్స్‌కు రారు. హీరో హీరోయిన్లను చూసే ప్రేక్షకులు వస్తారు.’అంటూ అల్లు అరవింద్‌ చెప్పారు.


ఈ మధ్యే సర్కారు వారి పాట సినిమా సక్సెస్‌ మీట్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు డాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కర్నూలులో జరిగిన ఈ ఈవెంట్లో మహేష్ తన కెరీర్‌లోనే తొలిసారిగా స్టేజ్‌పై స్టెప్పులేసి ఫ్యాన్స్‌‌ను అలరించారు. అల్లు అరవింద్‌ పరోక్షంగా మహేష్ బాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం అవుతోంది.


ప్రస్తుతం మనదేశంలో చిత్రపరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని పెద్ద సినిమాలు మినహా.. ఇతర చిత్రాలేవి జరిగిన బిజినెస్‌ను రికవర్ చేయలేకపోతున్నాయి. బాలీవుడ్‌ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. టాలీవుడ్‌లో సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పటికీ.. టికెట్ల రేట్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఓటీటీల ప్రాధాన్యత పెరగడం కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు దూరం కావడానికి  ఒక్క కారణంగా మారింది.