ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఫ్యాక్షన్ చిచ్చును తెలుగుదేశం పార్టీ రేపుతోందని ఆరోపించారు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దుర్గిమండలం జగమేశ్వరపాడు శివారులో జరిగిన కంచర్ల జల్లయ్య హత్య కేసుపై మాట్లాడిన ఆయన... ముద్దాయిలను టీడీపీ వెనకేసుకొస్తోందన్నారు. జల్లయ్య పది కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని అలాంటి వ్యక్తిని టీడీపీ మద్దతు తెలపడమేంటని ప్రశ్నించారు. 


వైఎస్‌ఆర్‌సీపీ లీడర్‌ చక్కనయ్య హత్య కేసులో జల్లయ్య A1గా ఉన్నాడని... అతనిపై మరిన్ని కేసులు ఉన్ననాయన్నారు. అందులో సెక్షన్ 302 కింద కూడా కేసులు ఉన్నట్టు వివరించారు పిన్నెల్లి. మృతుడు జల్లయ్య 302 కింద నమోదైన కేసుల్లో తానే రాజీ చేయించి ఇకపై ఎలాంటి గొడవలకు వెళ్లబోమంటూ దేవుడి సాక్షిగా ప్రమాణం చేయించా అని గుర్తు చేశారు. 


ప్రశాంతంగా ఉన్న పల్నాడును  తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న బ్రహ్మరెడ్డిని మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించిన  రోజు నుంచే నియోజకవర్గంలో గొడవలు మొదలయ్యాయి తెలిపారు. నియోజకవర్గంలో జరిగే ఫ్యాక్షన్ గొడవలకు చంద్రబాబు, బ్రహ్మారెడ్డి కారణమన్నారు.


ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి కుటుంబ నేపథ్యాన్ని వివరించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బ్రహ్మారెడ్డి తల్లి దుర్గమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జరిగిన ఏడు హత్యల కేసులో బ్రహ్మారెడ్డి A1గా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ హత్యానంతరం శవ రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు.


రాయలసీమ, కోనసీమ, పల్నాడులో గొడవలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే కారణమని కామెంట్ చేశారు పిన్నెల్లి. దయచేసి ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని రెచ్చగొట్టవద్దు అని తెలుగుదేశం పార్టీని ఆయన విజ్ఞప్తి చేశారు.


పల్నాడు జిల్లా మాచర్లలో దుర్గి మండలం మించాలపాడు వద్ద జల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేశారు. వివాహం నిమిత్తం బంధువులను పిలిచేందుకు జంగమహేశ్వరపాడు వచ్చి వెళ్తున్నప్పు ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇది కచ్చితంగా పిన్నెల్లి ప్రోత్సాహంతో జరిగిన హత్యే అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా ఆ పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. దీంతో వారి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.