ప్రభుత్వంలో ఇప్పుడు పనిచేస్తున్న వైద్యులంతా ఎంతో అదృష్టవంతులని, ఒక గొప్ప ప్రభుత్వంలో వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అభిప్రాయపడ్డారు. గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాలులో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వైద్య విభాగంపై సమీక్ష సమావేశం నిర్వహించారామె. దాదాపు నాలుగు గంటలపాటు సమావేశం కొనసాగింది.
సమీక్షలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ వైద్య రంగంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గుంటూరు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాత వైద్యులుగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. వైద్య రంగంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇదే జిల్లా నుంచి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
వైద్యారోగ్యశాఖ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏటా రూ.13 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని రజినీ తెలిపారు. నాడు-నేడు కింద ఆస్పత్రుల నిర్మాణం కోసమే ఏకంగా తమ ప్రభుత్వం రూ. 16వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఈ స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖకు నిధులు కేటాయించిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు.
సుదీర్ఘ కాలం తర్వాత పదోన్నతులు
దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ఫైళ్లకు బూజు దులిపిన ఘతన జగనన్నకే దక్కుతుందని తెలిపారు రజినీ. ఏ ప్రభుత్వ వైద్య సంస్థ కూడా ఇన్‌చార్జిల పాలనలో ఉండకూడదని నేరుగా అన్ని అర్హతలు ఉన్నవారినే సూపరింటెండెంట్‌లుగా, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌గా నియమిస్తున్నామని చెప్పారు. ఎక్కడా నిబంధనలు సడలకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గాని, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిపల్‌గాని దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇన్‌చార్జీలు కాకుండా అన్ని స్థాయి అర్హతలు ఉన్నవారే పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేశారు. అంటే తమ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వంఎన్ని కోట్ల నిధులు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది బాగా పని చేస్తేనే ఆ ఫలాలు ప్రజలకు సమర్థవంతంగా చేరతాయని చెప్పారు రజినీ.
సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ మధ్య సమన్వయం
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు మంత్రి రజినీ. అప్పుడే వైద్యులంతా బాగా పనిచేస్తారని తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో అతి త్వరలో ఎంసీహెచ్ బ్లాక్ భవన నిర్మాణం మొదలు కాబోతోందన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తాను తీసుకెళ్లానని ఆయన సానుకూలంగా స్పందించారని, జింఖానా ప్రతినిధుల సహాయ సహకారాలతో ఈ భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు సక్రమంగా పని చేయాల్సిందేనని ఆదేశించారు. ఎన్‌ఎచ్‌ఎం నిధులు అందుబాటులో ఉంటున్నా వాటిని వినియోగించుకోవడం లేదనే వార్తలు పీహెచ్‌సీలపై వస్తున్నాయని చెప్పారు. గడువులోగా హెచ్‌డీసీ నిధులను సమర్థవంతంగా వాడుకోవాలని చెప్పారు. ఆస్పత్రుల్లో మంచినీటి అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఫ్యాన్లు తిరిగేలా చూడాలన్నారు. కాన్పులు పీహెచ్‌సీల్లోనూ జరిగేలా చొరవ చూపాలని ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం పది కాన్పులు జరిగేలా చూడాలని చెప్పారు.
ట్రాన్స్‌ఫర్ల గురించి ఆలోచించొద్దు
ఇక్కడ ఉన్నవారంతా వైద్యులేనని, అంతా ఎంబీబీఎస్ చదువుకున్నవాళ్లేనని మంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వస్తే.. అక్కడికి వెళ్లి చదువుకున్న వారంతా.. విధులు విషయంలో ఎందుకు ఒకే ప్రాంతాన్ని కోరుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. వైద్యుడు ఎక్కడైనా పనిచేసేలా ఉండాలని, ఇది సహజ నియమని చెప్పారు. కోవిడ్ సమయంలో వైద్యులు ఎంతో బాగా పనిచేశారని, గుంటూరు జీజీహెచ్ లక్షల మంది ప్రాణాలను కాపాడిందని చెప్పారు. అదే స్ఫూర్తితో వైద్యులు ఎప్పటికీ పని చేయాలని తెలిపారు.
కావాల్సినవన్నీ ఇచ్చాం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లను నియమించామన్నారు. నర్సులు, వార్డ్ బాయ్‌లు, నైట్ వాచ్ మెన్ లు కూడా ఇలా అన్ని పోస్టులు భర్తీ చేస్తూ వచ్చామని తెలిపారు. 70 ఏళ్ల వైద్యశాఖ చరిత్రలో ఇంతగా నియామకాలను ఎప్పుడూ, ఎవరూ చేపట్టలేదని గుర్తుచేశారు. ఇంత ఇస్తున్న ఈ ప్రభుత్వం కోసం ఇంకెంతగా మనం పనిచేయాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.