పోటీ పరీక్షలు అంటేనే విద్యార్థులతో పాటు అభ్యర్థులలో విపరీతమైన ఒత్తిడి. ర్యాంక్ ల కోసం గంటల తరబడి చదివేస్తుంటారు. కానీ అలా ఒత్తిడికి దూరంగా చదివితే ఊహించని స్థాయిలో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు బొర్రా వరుణ్ చక్రవర్తి. తాజాగా విడుదలైన NEET ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొర్రా వరుణ్ చక్రవర్తి. నీట్ పరిక్షల కోసం ప్రెపరేషన్ ఎలా జరిగింది. ఎంత సమయం కేటాయించారు. తోటి విద్యార్దులకు ఏం చెప్పబోతున్నారంటూ వరుణ్ ని పలకరించింది ABP దేశం. ఈ సందర్బంగా ఏబీపీ దేశంతో మాట్లడుతూ అందరూ తాను రోజుకు ఎన్నిగంటలు చదివానంటూ అడుగుతున్నారని, అలా గంటల తరబడి తాను చదవలేదని ,చదివిన సమయం మాత్రం ఏకాగ్రతతో చదివానని చెప్పారు.


ఒక్కోసారి చదువు మొదలుపెట్టిన కొద్దిసేపటికే తనకు నిద్ర వచ్చేదని, అలా నిద్రవచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుని అలసిపోకుండా, ఒత్తిడికి గురికాకుండా నీట్ కోసం ప్రెపేర్ అయ్యానంటూ తెలిపారు వరుణ్ చక్రవర్తి. కాలేజీలో వారు ఇచ్చిన స్టడీ మెటీరియల్ తో పాటు , టీచర్స్ ఇచ్చే  సూచనలు తన ఈ విజయానికి దోహదం చేశాయన్నారు. నీట్ కోచింగ్ సమయంలో క్లాస్ రూమ్ లో పాఠాలు వింటున్న క్రమంలో ఏకాగ్రతగా ఉండటం వల్ల కొత్త త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు షెడ్యూల్ ప్రకారం చదువుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలిగామన్నారు. నీట్ లో 720 మార్కులకు గాను 720 సాధించి టాప్ లో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్ గా నిలవడం ఆనందంగా ఉందని, ఈ విజయానికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలేజీ యాజమాన్యానికి ధన్యావాదాలు తెలిపారు. శ్రీకాకుళం లాంటి జిల్లా నుండి జాతీయ స్దాయిలో పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందని, తమ జిల్లా నుంచి ఉత్తమ ర్యాంక్ లు కైవసం చేసుకున్నవారు సైతం అనేక మంది ఉన్నారని అన్నారు వరణ్ చక్రవర్తి. 
Also Read: NEET UG Results 2023: నీట్ యూజీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు- సిక్కోలు బిడ్డకు రెండో ర్యాంక్!



ఈ సందర్భంగా వరణ్ తల్లిదండ్రులు ABP దేశంతో మాట్లాడుతూ తమ బిడ్డ విజయం ఎంతో సంతోషానిచ్చిందని తెలిపారు. మేమిద్దరం టీచర్స్ కావడంతో మా వరణ్ ను ఏమాత్రం ఒత్తిడి చేయకుండా తనకు తాను చదువుకునేలా అవకాశం కల్పించామన్నారు.ర్యాంకుల కోసం పిల్లలను ఒత్తిడి చేయడం సరైనది కాదని, ఒత్తిడి వల్ల ప్రతిభ కనబర్చాల్సిన విద్యార్థులు ఇంకా దిగువ స్దాయిలో ఫలితాలు తెచ్చుకుంటున్నారని తెలిపారు. పోటీ పరిక్షలకు ప్రిపేరవుతున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించి, దానికి తగినట్లుగా టార్గెట్ ఫిక్స్ చేయాలని సూచించారు. అలా కాకుండా అందరికీ ఓకే లక్ష్యం అన్నట్లుగా తీవ్ర ఒత్తిడి చేస్తే చదువులో ముఖ్యంగా NEET వంటి పోటీ పరిక్షల్లో మరింత వెనుకబడే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: NEET UG: ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారానే మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలు, ఎన్‌ఎంసీ ప్రతిపాదన!