కాకినాడకు చెందిన ఓ మహిళ, ఆమె కుమార్తె విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఓ మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయని ప్రశ్నించారు. వెంటనే ఆ మహిళకు, ఆమె కుమార్తెను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి తగిన సాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘‘కాకినాడకు చెందిన ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోంది? ఒక బాధిత మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయి? బిడ్డ వైద్యం కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు? మీ ఆరోగ్య శ్రీ ఏమయ్యింది? ఒక మహిళ చేస్తున్న పోరాటానికి స్పందించకపోవడమే వైఎస్ జగన్ మానవీయతా? న్యాయం కోరుతూ ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ సమస్యను ఏడాది కాలంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ప్రశ్నించిన ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదంటారా? పైగా పిచ్చాసుపత్రికి తరలిస్తారా? అసలు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం ఎవరు? ఆమెను చివరికి ఏం చేయబోతున్నారు? వెంటనే ఆరుద్ర సమస్యను పరిష్కరించాలి. ఆమె కుటుంబానికి తగిన సాయం అందించాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఆరుద్ర ఎవరు?
కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళకు ఓ కుమార్తె ఉంది. ఆమె కదల్లేని స్థితిలో ఉండగా, వెన్నెముక దెబ్బతిన్నదని దానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. చికిత్స కోసం కోసం సొంతిల్లు అమ్ముదామని ప్రయత్నించగా, మంత్రి సపోర్టుతో కొంతమంది అడ్డుపడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. అందుకని, తన బాధ చెప్పుకొనేందుకు గతేడాది నవంబరులో సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. అక్కడ పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె తన చేతిని కోసుకోవడం సంచలనంగా మారింది.
తర్వాత సొంత జిల్లాలో కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. అయినా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసి కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా చికిత్సకు యత్నించారు.. వైద్యులు. అక్కడి నుంచి విశాఖ మెంటల్ హాస్పిటల్ కు ఆరుద్రను, ఆమె కుమార్తెను తరలించారు. అయితే, ఆమె డిప్రెషన్ లో ఉండి, మానసిక స్థితి సరిగ్గా లేనందువల్లే ఆమెను విశాఖ మెంటల్ హాస్పిటల్ కు తరలించామని జీజీహెచ్ డాక్టర్లు చెప్పారు.