AP Minister Seediri Appalaraju at Govt Hospital Palasa: ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు అవసరమైతే డాక్టర్‌గారూ సేవలు అందించేందుకు వెనుకాడటం లేదు. డాక్టర్ గా సేవలు అందించిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు రెండో కేబినెట్‌లోనూ మంత్రిగా సీదిరి అప్పలరాజు అవకాశం దక్కించుకున్నారు. అయినా, ఆసుపత్రిలో అడుగుపెట్టగానే తెల్ల కోటు వేసుకుని డాక్టర్‌గా మారిపోయి పేషెంట్లకు వైద్య చికిత్స అందించారు.
ఆసుపత్రికి హుటాహుటీన మంత్రి అప్పలరాజు..
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో గత్తం తులసిరావు భార్య దీప(32) పురుగుల మందు తాగింది. తన ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆకాష్, నక్షత్రలకు కూడా పురుగుల మందు తాగించి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 అంబులెన్స్ లో పలాస ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందగానే బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కొవిడ్19 నిబంధనలు పాటించిన మంత్రి.. పనిలో పనిగా బాధితులకు చికిత్స చేశారు. ఆసుపత్రికి వచ్చిన మరికొందరు పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
మంత్రిగా సేవలు అందిస్తున్నప్పటికీ, తాను ఎంచుకున్న డాక్టర్ వృత్తి కనుక ఆసుపత్రిలో అడుగుపెట్టగానే మళ్లీ డాక్టర్‌గా మారిపోయారు సీదిరి అప్పలరాజు. పేషెంట్లకు చికిత్స అందించడంతో పాటు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తల్లి, ఇద్దరు పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కుటుంబ కలహాలు కారణంగా తాను చనిపోవాలనుకోవడంతో పాటు పిల్లలను సైతం వెంట తీసుకెళ్లాలని దీప భావించింది. ఈ పని చేసినందుకుగానూ ఆమెపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మంత్రి అప్పలరాజు నేపథ్యమిదే..
సీదిరి అప్పలరాజు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువులో మేటి. 7వ తరగతిలో జిల్లాలో రెండో ర్యాంకు సాధించిన అప్పలరాజు.. 8 నుంచి 10 తరగతి వరకు సింహాచలం (అడివివరం స్కూల్) గురుకుల పాఠశాలలో చదివారు. 10వ తరగతిలో ఉమ్మడి ఏపీలో నాలుగో ర్యాంకు సాధించారు. ఓపెన్ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు సాధించిన అప్పలరాజు... కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆపై ఎంట్రన్స్ పరీక్షలో పాసై విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌లో పీజీ పూర్తిచేసి, పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించి డాక్టర్‌గా గుర్తింపు పొందారు.
Also Read: Lagadapati Rajagopal : వైసీపీ ఎమ్మెల్యేతో లగడపాటి భేటీ, రీఎంట్రీకి ట్రాక్ ప్రిపేర్ చేస్తున్నారా?