Lagadapati Rajagopal Meets Ysrpc Mla : సమైఖ్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో లగడపాటి పలువురు నేతలతో వరుస భేటీలు అవుతున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి 2024 ఎన్నికల్లో పోటీగా సిద్ధం అవుతున్నట్లు కొందరు నేతలు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన రాజగోపాల్ అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీ నేతలతో లగడపాటి భేటీతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి రూట్ క్లియర్ చేస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. వైస్సార్సీపీ తరపున విజయవాడ పార్లమెంట్ స్థానానికి మళ్లీ పోటీ చేయనున్నారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్,  నందిగామ వైసీపీ నేతలతో సమావేశం అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. 



ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో భేటీ 


ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన అనుచరుడు పాలేటి సతీష్ నివాసంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో లగడపాటి రాజగోపాల్ సమావేశం అయ్యారు. లగడపాటి తన తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటించనున్నట్లు నందిగామ వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే ఖమ్మంలో పర్యటిస్తున్న ఆయన ఎవరితోనైనా భేటీ అవుతారా అనేది కీలకంగా మారింది. అయితే లగడపాటి భేటీపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు తెలిపారు. ఆప్యాయంగా పలకరించుకున్నాం కానీ రాజకీయ చర్చలు తమ మధ్య రాలేదన్నారు. రాజకీయాల్లో కులానికి చోటులేదన్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలపై స్పందించిన వసంత కృష్ణ ప్రసాద్ కులం పేరుతో ఎవరూ గెలవలేరని తెలిపారు. రాజకీయాల్లో కులాల ప్రస్తావన ఎక్కువ అయిందన్నారు.చంద్రబాబు, జగన్ ఎవరైనా ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే గెలవలేరన్నారు. రాజకీయాల్లో అందరూ కావాలన్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం రాజకీయ మంతనాలు జరిగాయని అంటున్నారు. ఈ భేటీ అనంతరం లగడపాటి ఖమ్మం బయల్దేరి వెళ్లారు. ఖమ్మంలో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. 



రీఎంట్రీపై జోరుగా చర్చ 


అయితే లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన వైసీపీలో చేరితో విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అంతగా యాక్టివ్ గా లేకపోవడం, లగడపాటికి ఉన్న అనుభవంతో ఈ స్థానంలో పోటీ చేస్తే గెలుస్తారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లగడపాటి తన రీఎంట్రీపై పలువురు నేతలతో చర్చించేందుకు భేటీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.