Nellore Boy Divi Tanuj Chaudhary Elected as MLC in Australia: నెల్లూరు కుర్రాడేంటి.. ఆస్ట్రేలియాలో కౌన్సిల్ సభ్యుడు అవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ? అవును ఇది నిజం.. చిన్న వయసులోనే సామాజిక సేవా కార్యక్రమాల పట్ల అతనికున్న అంకిత భావం, నలుగురికీ మేలు చేయాలన్న గుణం విదేశాలలో ఆ టీనేజర్‌ను ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా చట్ట సభలకు అతడిని నామినేట్ చేసింది. మరో విశేషం ఏంటంటే.. త్వరలో అతడు అతిపిన్న వయసులో మంత్రి అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
ఎవరీ అబ్బాయి..?
ఆ అబ్బాయి పేరు దివి తనూజ్ చౌదరి (Divi Tanuj Chaudhary). ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్లస్ వన్ చదువుతున్నాడు. కాలేజీలో చురుగ్గా ఉండే తనూజ్ చౌదరి.. సేవా కార్యక్రమాలంటే ముందుంటాడు. కాలేజీ తరపున, తన స్నేహితులతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆ పేరుమీద సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. సామాజిక చైతన్యం కలిగించేందుకు పలు కార్యక్రమాలు తనకు తానే సొంతగా రూపొందించుకుని స్నేహితుల్ని అందులో భాగస్వాముల్ని చేస్తుంటాడు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం, ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఇబ్బందులు పడేవారికి అండగా నిలవడం, ఆస్పత్రులు, అనాథ శరణాలయాల వద్ద చారిటీ కార్యక్రమాలు.. ఇలా అన్నిట్లోనూ తనూజ్ చౌదరి ముందుండేవాడు. అలాగే అతని స్నేహితులు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
ఎలా పేరొచ్చింది..?
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తనూజ్ చౌదరికి కాలేజీలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహంతో అతను ఎమ్మెల్సీకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అక్కడి చట్టాల ప్రకారం ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువత చట్టసభల్లో ఎంపికయ్యేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ క్రమంలో అన్ని అర్హతలను పరిశీలించిన తరువాత యువత కోటాలో తనూజ్ చౌదరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసారు. ప్రస్తుతం సిడ్నీలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీగా తనూజ్ చౌదరి పాల్గొంటున్నాడు.
పుత్రోత్సాహం..
తనూజ్ చౌదరి తండ్రి దివి రామకృష్ణ చౌదరి. సొంత ఊరు కందుకూరు సమీపంలోని తూర్పు కమ్మపాలెం. గతంలో ప్రకాశం జిల్లాలో ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వచ్చింది. 12 ఏళ్ల క్రితం రామకృష్ణ, ఆయన భార్య ప్రత్యూష దంపతులు ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఈ క్రమంలో కాలేజీకి వెళ్తున్న తనూజ్ చౌదరి.. తన సామాజిక కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకుని అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. చట్ట సభలకు హాజరవుతున్నాడు. కొడుకుకి వచ్చిన గుర్తింపు తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నారు రామకృష్ణ.
తనూజ్ చౌదరికి వచ్చిన గుర్తింపుతో అతని సొంతూరు తూర్పు కమ్మపాలెం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం నుంచి వెళ్లిన రామకృష్ణ కొడుకు అంత ప్రయోజకుడవుతాడని తాము అస్సలు ఊహించలేదని అంటున్నారు. తనూజ్ చదువులోనూ సామాజిక సేవా రంగంలోనూ మరింతగా రాణించాలని, మరింత గుర్తంపు తెచ్చుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
Also Read: AP Schools : ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎప్పటినుంచంటే?