GST Rates GST Council Hiking tax of 143 items: వస్తు, సేవల పన్ను (GST)లో భాగంగా 143 వస్తువులపై పన్ను రేట్లు పెంచడానికి జీఎస్టీ కౌన్సిల్ రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఈ 143 వస్తువులలో 92 శాతం వస్తువులు, ఐటమ్స్‌కు ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబును పెంచాలని కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై సమీక్షించుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ కౌన్సిల్ సూచించింది.


ఈ వస్తువులపై ఇక జీఎస్టీ బాదుడే బాదుడు..
జీఎస్టీ మండలి సూచించిన వస్తువులలో పాపడ్, బెల్లం, పవర్ బ్యాంక్‌లు, గడియారాలు, సూట్‌కేసులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పెర్ఫ్యూమ్స్ అండ్ డియోడరెంట్స్, కలర్ టీవీ సెట్‌లు (Below 32 Inches), చాక్లెట్‌లు, చూయింగ్ గమ్‌లు, వాల్‌నట్స్, కస్టర్డ్ పౌడర్, ఆల్కహాల్ రహిత పానియాలు, సిరామిక్ సింక్‌లు, వాష్ బేసిన్లు, గాగుల్స్, కళ్లద్దాలు/ గాగుల్స్‌కు వాడే ఫ్రేమ్‌లు, తోలుకు సంబంధించిన దుస్తులు, ఆ దుస్తుల ఉపకరణాలు ఉన్నాయని సమాచారం.


పాపడ్, బెల్లం వంటి వస్తువులకు జీఎస్టీ రేట్లు సున్నా నుండి 5 శాతం పన్ను స్లాబ్‌కి మారవచ్చు. లెదర్ దుస్తులు మరియు ఉపకరణాలు, చేతి వాచీలు, రేజర్‌లు, పెర్ఫ్యూమ్‌లు, డెంటల్ ఫ్లాస్, చాక్లెట్‌లు, కోకో పౌడర్, ఎక్స్‌ట్రాక్ట్‌లు మరియు కాఫీ, ఆల్కహాల్ రహిత డ్రింక్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు/షాపింగ్ బ్యాగ్‌లు సిరామిక్ సింక్‌లు, వాష్ బేసిన్‌లు, ప్లైవుడ్, తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, నిర్మాణ వస్తువులు జీఎస్‌టీ రేటును 18 శాతం నుంచి 28 శాతానికి పెంచే అవకాశం ఉంది.


రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జీఎస్టీ పరిహారాల విధానం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. ఇకనుంచి ఆదాయాలలో లోటును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి రానున్న తరుణంలో అందుకు తగ్గట్లుగా ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ పలు రకాల వస్తువులు, సేవలపై పన్నులను పెంచే దిశగా యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, నవంబర్ 2017 మరియు డిసెంబర్ 2018లో కౌన్సిల్ తీసుకున్న రేట్ల తగ్గింపు నిర్ణయాలకు తాజా ప్రతిపాదన భిన్నంగా ఉంది. అంటే గతంలో తగ్గించిన వస్తువుల ట్యాక్స్ శ్లాబ్‌లు తాజాగా పెరగనున్నాయి. త్వరలోనే దీనిపై జీఎస్టీ కౌన్సిల్, కేంద్రం అధికారిక ప్రకటన చేయనున్నాయి. 


GST వసూళ్లు మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.42 లక్షల కోట్లకు చేరాయి. మార్చి 2020తో పోల్చితే మార్చి 2021లో 45.6 శాతం పెరుగుదల కనిపించింది. ఫిబ్రవరిలో విక్రయాలు సైతం 14.7 శాతం పెరిగాయి.  తాజాగా చేసిన ప్రతిపాదనల ప్రకారం.. వాల్‌నట్‌లపై జీఎస్‌టీ 5 శాతం నుంచి 12 శాతానికి, కస్టర్డ్ పౌడర్‌పై 5 శాతం నుంచి 18 శాతానికి, టేబుల్ మరియు వంట సామాగ్రిపై 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతారు.


గతంలో తగ్గించి, ఇప్పుడు పెంచుతూ.. 
నవంబర్ 2017 గౌహతిలో జరిగిన జీఎస్టీ సమావేశంలో తోలు దుస్తులు, తోలు వస్తువులు, చాక్లెట్‌లు, కోకో పౌడర్, మేకప్ ఐటమ్స్, బాణసంచా, దీపాలు, సౌండ్ రికార్డింగ్ పరికరాలు వంటి వస్తువుల ధరలు తగ్గించారు. తాజాగా వీటి ధరలు పెరిగేలా ట్యాక్స్ శ్లాబ్‌ను 18 నుంచి 28 శాతానికి పెంచుతున్నారు. వీటితో పాటు డిసెంబర్ 2018 జీఎస్టీ సమావేశంలో కలర్ టీవీ సెట్‌లు, మానిటర్‌లు (32 అంగుళాల కంటే తక్కువ ఉన్నవి), డిజిటల్ మరియు వీడియో కెమెరా రికార్డర్‌స్, పవర్ బ్యాంక్‌లు వంటి వాటిపై జీఎస్టీ రేట్లు తగ్గించారు. కానీ జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో వీటి ధరలు పెంచుతూ ప్రతిపాదన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సమీక్షించుకోవాలని సూచించింది.