డబ్బులుంటే దాచుకోవాలే గానీ, అనవసర ఖర్చులు, జూదాలకు ఎందుకు వేస్ట్ చేయడమనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అతడి భార్య కూడా అదే ఉద్దేశంతో భర్తను వారించేది. వద్దు వద్దంటూ ఎన్నోసార్లు అడ్డుకున్నా.. ఆ భర్త ఆమె మాట వినేవాడు కాదు. ఒకటి కాదు రెండు కాదు, గత 34 ఏళ్ల నుంచి అతడు ఆమె మాట వినకుండా తన లక్ పరీక్షించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు రూ.2.5 కోట్లతో భార్యకు ఊహించని షాకిచ్చాడు.
ఇంతకీ అతడికి అంత డబ్బు ఎలా వచ్చిందనేగా మీ సందేహం? అదే లాటరీ మహిమ. అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అయితే, ప్రయత్నం లేకుండా ఫలితం రాదు. లక్ లేకుండా లక్ష్మీదేవి వరించదు. అందుకే, పంజాబ్‌లోని బతిందాకు చెందిన రోషన్ సింగ్ తనవంతు ప్రయత్నంగా గత 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు లక్ష్మీదేవి తన ఇంటి తలుపు తట్టదా అని ఎదురుచూసేవాడు. కానీ, ఒక్కసారి కూడా లాటరీ విన్ కాలేదు. దీంతో అతడి భార్య.. ‘‘డబ్బులు ఊరికే రావు, వాటిని సేవ్ చేయండి’’ అని చెప్పేది. కానీ, లాటరీ టికెట్లు కొనడాన్ని అలవాటుగా మార్చుకున్న రోషన్‌కు ఆమె మాటలు బుర్రకు ఎక్కేవి కావు. ఆమెకు తెలియకుండానే కొన్ని లాటరీ టికెట్లను కొనేవాడు. తాజాగా ఓ లాటరీ టికెట్ డీలర్ నుంచి రోషన్‌కు ఫోన్ వచ్చింది. ‘‘మీరు రూ.2.5 కోట్ల లాటరీని గెలుచుకున్నారు’’ అని అతడు చెప్పగానే రోషన్ ఆనందానికి అవధుల్లేవు.
రోషన్ ‘బీబీసీ హిందీ’తో మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా ఉద్యోగం లభించకపోవడంతో 1987లో బట్టల షాపులో పనిచేయడం ప్రారంభించాను. 18 ఏళ్ల తర్వాత సొంతంగా ఒక షాప్ ప్రారంభించాను. 1988 నుంచి లాటరీ టికెట్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా దాచుకొనేవాడిని. అప్పుడప్పుడు రూ.100 నుంచి రూ.200 వరకు లాటరీ డబ్బులను గెలుచుకొనేవాడిని. కానీ, పెద్ద మొత్తాన్ని గెలుచుకోలేకపోయేవాడిని. కానీ, పెట్టిన డబ్బు ఏదో ఒక ప్రైజ్ మనీ రూపంలో తిరిగి వచ్చేది. అందుకే, లాటరీ టికెట్లను కొనుగోలు చేయడం ఆపలేదు’’ అని తెలిపాడు. తన లక్ పరీక్షించుకోవడం కోసం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో అతడి భార్య చాలాసార్లు వారించింది. అతడు ఎలాగైనా కుంభస్థలాన్ని బద్దల కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడని తెలిసి, హెచ్చరించడం మానేసింది.
Also Read: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక, ఈ రెండు నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు
లాటరీ టికెట్ ఏజెంట్ కాల్ చేయగానే.. తన స్నేహితులు తనను ఆటపట్టిస్తున్నారు కాబోలని రోషన్ భావించాడు. మరోసారి వివరాలు అడగ్గా.. తాము రామ్‌పురా పౌల్ లాటరీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, మీరు రూ.2.5 కోట్లు గెలుచుకున్నారని స్పష్టం చేశారు. ‘‘ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి కనీసం రూ.10 లక్షలైనా గెలుచుకోవాలనే లక్ష్యంతోనే లాటరీ టికెట్లు కొనేవాడిని. అంతకంటే ఎక్కువ ఆశించేవాడిని కాదు. కానీ, దేవుడు కరుణించి ఏకంగా ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకొనేలా చేశాడు’’ అని రోషన్ తెలిపాడు. పన్నులన్నీ చెల్లించిన తర్వాత చేతికి రూ.1.75 కోట్లు వస్తాయని, ఈ డబ్బును తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెడతానని అతను పేర్కొన్నాడు. కొంత మొత్తంతో కొత్త వ్యాపారం మొదలుపెడతానని తెలిపాడు.
Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?