మెల్లగా ‘నడుచు’కొనేవారు.. ఎక్కువ కాలం బతికేస్తారా? మనషుల విషయంలో అది సాధ్యమో కాదు తెలియదుగానీ, తాబేళ్లు మాత్రం ఇంచక్కా బతికేస్తాయి. ఇందుకు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలెనా దీవిలో నివసిస్తున్న ఈ తాబేలే నిదర్శనం.
సాధారణ తాబేళ్లు 80 నుంచి 150 ఏళ్ల వరకు జీవిస్తాయట. అయితే, జాతిని బట్టి కూడా తాబేళ్ల ఆయుష్సులో మార్పు ఉంటుందట. ముఖ్యంగా భారీ సైజులో ఉండే తాబేళ్లు 300 ఏళ్లు వరకు జీవించగలవట. ప్రస్తుతం హెలెనా ద్వీపంలో నివసిస్తున్న సీషెల్స్ రకం తాబేలు జోనాథన్‌ను త్వరలోనే 190వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. దీనికి ఎవరి దిష్టి తగలకపోతే మరో వందేళ్లు కచ్చితంగా బతికేస్తుంది. ఎందుకంటే.. ఈ తాబేలు ఇప్పటికీ నవ యువకుడిలా యాక్టీవ్‌గానే ఉంది.
ఈ తాబేలు 1832లో జన్మించినట్లు అంచనా వేశారు. ఈ ఏడాది జనవరి నెలలో ఈ భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతన చెలోనియన్‌గా జోనాథన్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కింది. ఇదివరకు ఈ రికార్డు 1777లో టోంగా రాజకుటుంబానికి కానుకగా ఇచ్చిన రేడియేటెడ్ తాబేలు తుయ్ మలీలాపై ఉండేది. 188 ఏళ్లు జీవించిన ఆ తాబేలు 1965లో చనిపోయింది. ఇప్పుడు దాని రికార్డును జోనాథన్ బద్దలకొట్టింది.
జోనాథన్ కేవలం తాబేళ్ల జాతుల్లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భూగోళ జంతువు కూడా. ఇది ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ తాబేలు తన జాతుల సగటు జీవితకాలం కంటే చాలా ఎక్కువ కాలం జీవించడం విశేషం. సెయింట్ హెలెనా SPCAకు చెందిన టినీ లూసీ మాట్లాడుతూ.. ‘‘భారీ తాబేళ్లు సాధారణంగా 150 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కాబట్టి, జోనాథన్ ఇన్నేళ్లు ప్రాణాలతో ఉండటం గ్రేట్’’ అని తెలిపాడు.
Also Read: లక్కున్నోడు - 34 ఏళ్లుగా భార్య వద్దన్నా వినలేదు, ఇప్పుడు రూ.2.5 కోట్లతో ఆమెకు షాకిచ్చాడు!
‘‘జోనాథన్ ఇప్పుడు కంటిశుక్లం కారణంగా సరిగ్గా చూడలేకపోతోంది. వాసన గ్రహించే శక్తిని కూడా కోల్పోయింది. అయినప్పటికీ.. దానికి తాను నివసించే ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉంది. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ చక్కగా జీవిస్తోంది. ఎక్కువగా గడ్డి ఉండే ప్రాంతాల్లోనే తిరుగుతూ ఆహారానికి ఇబ్బంది లేకుండా జోనాథన్ జాగ్రత్త పడుతోంది’’ అని లూసీ పేర్కొన్నాడు.
జోనాథన్ 1882లో బ్రిటీష్ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్ సర్ విలియం గ్రే-విల్సన్‌కు బహుమతిగా లభించింది. ఆయన సెయింట్ హెలెనాకు ద్వీపానికి గవర్నర్‌గా ఎంపిక కావడంతో జోనాథన్ కూడా ఆయనతో కలిసి ఈ ద్వీపంలో జీవించడం మొదలుపెట్టింది. దాదాపు రెండు శతాబ్దాల్లో అది ఆ ద్వీపానికి పదవీ బాధ్యతలు స్వీకరించిన 31 మంది గవర్నర్లను చూసింది. 1882-86 మధ్య కాలంతో సుమారు 137 సంవత్సరాల క్రితం జోనాతన్‌కు తీసిన పురాతన ఫొటో ఇప్పటికే ఆ ద్వీపంలో పదిలంగా ఉంది. సెయింట్ హెలెనాస్ గవర్నమెంట్ హౌస్ దగ్గర మరో పెద్ద తాబేలుతో కలిసి జోనాథన్ గడ్డి తింటున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఈ తాబేలు రెండు ప్రపంచ యుద్ధాలను కూడా చూసింది. లక్కీగా కోవిడ్-19 తన వరకు రాలేదు కాబట్టి, తాబేలు బిందాస్‌గా జీవిస్తోంది. అయితే, ఈ తాబేలు ఇప్పటికీ యాక్టీవ్‌గానే ఉంటుందట. ద్వీపం మొత్తం తిరుగుతూ వీలైనంత ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తోందట. (Image Credit: Guinness World Records)
Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?