నిజాయితీగల పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ, ప్రభుత్వం రెండు సమన్వయంతో పని చేసి లీడర్లలో ఉన్న సంతృప్తిని తగ్గించాలని సూచించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చట్టం పరిధిలో పని చేయాల్సిన ప్రభుత్వానికి కొన్ని పరిధిలు ఉంటాయన్నారు. అలాంటి టైంలో ప్రభుత్వం చేయలేని పనులను పార్టీ చేయాలని తెలిపారు. పార్టీ అప్పగించిన పనులు చేయడానికి సమర్థులను గుర్తించాలన్నారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దాసన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని ధర్మాన సూచించారు. తొమ్మిదేళ్లు పని చాలా మందికి పార్టీ, ప్రభుత్వ పదవులు వచ్చాయన్న ఆయన.. రాని వారిలో అసంతృప్తి ఉందన్నారు. అలాంటి వారి వల్ల పార్టీ బలహీన పడకూదన్నారు. వ్యక్తి నీరశతో పార్టీ బలహీన పడితే అందరూ దెబ్బతింటారని హెచ్చరించారు. పార్టీ బలపడి మళ్లీ అధికారంలోకి వస్తే ఆ నిరాశతో ఉన్న వ్యక్తికి మంచి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. మరుగున పడిపోయిన చాలా మందికి ఇప్పుడు పదవులు వచ్చాయని ఉదాహరించారు.
అసంతృప్తులను తప్పించి పార్టీ అనుబంధ విభాగాల్లో కొత్త రక్తం ఎక్కించాలని సూచించారు ధర్మాన. కొత్త జనరేషన్ వస్తే తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఎక్కువ పని చేస్తారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలోనైనా ఇలానే జరుగుతుందని పేర్కొన్నారు. అనుబంధ విభాగలకు సంబంధించిన నాయకత్వ ఎంపిక కార్యకర్తలే నిర్వహించుకునేలా చేయాలన్నారు. సభ్యులంతా ఒకచోట కూర్చొని నాయకుడిని ఎంపిక చేసుకుంటే మంచిదన్నారు. క్షేత్రస్థాయిలో తేలని పక్షంలో రెండు మూడు పేర్లతో వస్తే జిల్లా నాయకత్వం నిర్ణయించాలని సూచించారు. దీని వల్ల ఒక్కో యూనిట్‌లో కార్యకర్తల ఆమోదం కలిగిన వాళ్లు నాయకత్వంలోకి వచ్చేస్తారన్నారు.
ఈ రెండేళ్లలలో భిన్నంగా పని చేయాల్సిన అవసరం ఉందన్న ధర్మాన ఆ మేరకు సీఎం జగన్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న పార్టీ పనితీరు చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారని పేర్కొన్నారు. ఈ పార్టీ ప్రజలకు ఏం చెప్పింది, ఏం చేసింది, ఎలా వ్యవహరించింది, ఎంత నిజాయితీగా ఉంది అనేది చూస్తారన్నారు. ఇప్పుడు దేశంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోందన్నారు. దేశంలోని ప్రజలు నీతి నిజాయితీ ప్రభుత్వాల కోసం చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
పంజాబ్‌లో ప్రజలు ఆప్ పని తీరు చూసి మాత్రమే గెలిపించారన్నారు మంత్రి ధర్మాన. కులం అడ్డంపెట్టుకొని గెలుస్తాడని, మతం అడ్డం పెట్టుకుంటే గెలుస్తారని... ఓ ప్రాంతం కోసం ఆందోళన చేసిన వ్యక్తినే గెలిపిస్తారని అనుకోవచ్చు. పంజాబ్‌లో ఆప్ కులం, మతం, డబ్బు ఏమీ లేకుండా గెలిచిందన్నారు. దిల్లీలో ఆపార్టీ పాలన చూసిన వాళ్లంతా ఆప్‌కు పట్టం కట్టారని తెలిపారు.
అందుకే ఇక్కడ కూడా అవినీతి ఏ స్థాయిలో ఉన్నా కట్ చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని గుర్తు చేశారు ధర్మాన. నిజాయితీగా లేకుంటే కష్టమని సీఎం కూడా అందరికీ సంకేతాలు ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చూపించిన దిశలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. తన అవసరం ఎప్పుడు వచ్చినా పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు, జిల్లా నాయకులకు తెలిపారు.