Cow Calf Barasala: మనం ఇళ్లల్లో చిన్న పిల్లలకు అట్టహాసంగా బారసాల చేయడం చాలా సార్లే చూసుంటాం. ఉయ్యాలలో వేసి లాలి పాటలు పాడుతూ.. సంబురం చేసుకోవడం పరిపాటి. కానీ మచిలీపట్నంకు చెందిన ఓ కుటుంబం.. ఆవు దూడకు అంగరంగ వైభవంగా బారసల నిర్వహించింది. మూగజీవాలపై తమకున్న అమితమైన  ప్రేమను లోకానికి చాటి చెప్పారు. దూడకు హారతులు ఇచ్చి, ఉయ్యాలలో కూడా వేశారు. అంతేనా అంతా కలిసి ఉయ్యాల ఊపుతూ.. లాలి పాటలు కూడా పాడారు. దానికి ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపిస్తూ బంధు మిత్రుల సమక్షంలో ఆనందంగా బారసల జరుపుకున్నారు.


లేగదూడకి లక్ష్మీ అని నామకరణం..


మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవానిపాలెంలో మైధిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె గత పదేళ్లుగా ఓ ఆవును పెంచుకుంటోంది. దానికి కంటికి రెప్పలా, సొంత బిడ్డలా కాపాడుకుంటోంది. అంతేకాదండోయ్.. ఆ ఆవుకు బంగారం అని పేరు కూడా పెట్టుకుంది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు బంగారం.. ఆగష్టు 1వ తేదీన దూడను ప్రసవించింది. తమ పిల్లలకు బారసాల చేసిన విధంగానే దూడకు నిన్న ఘనంగా బారసాల నిర్వహించారు. ఆ దూడకి లక్ష్మీ అని నామకరణం కూడా చేశారు. బంధువులు, మిత్రులు, చుట్టుప్రక్కల ముత్తయిదువులను పిలిచి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. దూడను ఉయ్యాల్లో పడుకో పెట్టి లాలి పాటలు కూడా పాడారు. హారతులు ఇచ్చి బుజ్జి పాపాయిని ముద్దాడినట్లు ముద్దాడారు. 


"మేము పది సంవత్సరాల నుంచి ఆవును పెంచుకుంటున్నామండి. దానికి మొదట మగ దూడ. రెండోసారి కూడా మగ దూడే పట్టింది. మొదటి దానికి శ్రీరాం అని రెండో దానికి సాయిరాం అని పేరు పెట్టాం. మూడో సారి పెయ్యదూడ పుట్టింది. దానికి సీత అని పేరు పెట్టుకున్నాం. నాలుగోది కూడా పెయ్యదూడ. దీనికి లక్ష్మీ పేరు పెట్టాం. మనుషులకు చేసినట్లుగానే బంగారానికి కూడా అన్ని ఫంక్షన్లు చేస్తుంటాం. దూడకి బారసాల కూడా చేస్తుంటాం. ఆవు అంటే మహాలక్ష్మి. అందుకే అన్నీ చేస్తుంటాం". - మైథిలీ   


పండ్లు, పలాలు తినిపించిన ముత్తయిదువలు..


ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు అ మూగజీవం పట్ల ప్రేమను చూపిస్తు వేడుక కోసం తయారు చేయించిన పలు రకాలు  స్వీట్లు, పండ్లు దూడకు తినిపించారు. గత ఏడాది బంగారం ఆవుకి పుట్టిన సీత అనే దూడకి కూడా ఇదే విధంగా బారసాల నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులను విస్మరించే ఈ రోజుల్లో మూగజీవాల పట్ల ప్రేమను చూపించటం పలువురిని కదిలిస్తోంది. మూగ జీవాలపై సానుభూతి చూపడంతో పాటు వాటిని ప్రేమగా చూసుకుంటూ వేడుకలు జరుపుతున్న కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. 


Also Read: Gas Cylinders Explosion: ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, లారీలో ఒక్కసారిగా పేలిన వందల సిలిండర్లు


Also Read: Also Read: Pawan Kalyan Political : రాజకీయాల్లో ఆ "పవర్" ఏది ? పవన్ కల్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ ఎప్పుడవుతారు?