Pawan Kalyan Political : పవన్ కల్యాణ్. ఈ మాట వింటే లక్షల మంది వైబ్రేషన్. ఏ హీరోకూ లేనంత ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్ సినిమా వల్ల మాత్రమే రాలేదు. ఆయన సామాజిక స్పృహ, రాజకీయ ఆలోచనలు, సమాజానికి మంచి చేద్దామన్న ఓ పట్టుదల కారణంగా కూడా అభిమానులు ఉన్నారు. అన్యాయాలపై ఎదిరించాలన్న ఓ ఫైర్ పవన్ కల్యాణ్‌లో కనిపిస్తుంది. అందుకే యువరాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చి.. జనసేనతో కంటిన్యూ అవుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో అన్నీ వైఫల్యాలే. ఎందుకిలా జరుగుతోంది ?. రాజకీయంగా పవన్ కల్యాణ్ సూపర్ హిట్లు ఎందుకు కొట్టలేకపోతున్నారు ?
సామాజిక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ సామాజిక స్పృహ ఉన్న నేత. వందలు, వేల పుస్తకాలు చదివారు. రాజకీయంగా సమాజానికి ఏదైనా చేయాలనుకునే స్వభావం ఉన్న నేత. అందుకే సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులో యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు కోరుకోలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత సైలెంటయ్యారు. కానీ ఆయనలోని రాజకీయ భావాలు కుదురుగా ఉండనీయలేదు. అందుకే జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రారంభించి.. తాను అందరి లాంటి రాజకీయ నాయకుడ్ని కాదని.. ఓట్లు చీల్చడం ఇష్టం లేదని చెప్పి పోటీ చేయలేదు. టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. అయితే అదే పెద్ద తప్పని కొంత మంది అంటారు. పోటీ చేయడం ఇష్టం లేకపోతే పార్టీ ప్రకటన చేయకుండా ఉండాల్సిందని ఎన్నికలైన తర్వాత పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేదని కొంత మంది వాదన.
పార్టీని ప్రకటించి టీడీపీ-బీజేపీకి మద్దతు ప్రకటించిన పవన్
టీడీపీ-బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్న ఆయన చివరి ఏడాది విభేధించి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి 2019లో పోటీ చేశారు. కానీ ఆయన రెండు చోట్లా ఓడిపోవడం పెద్ద మైనస అయింది. అదే సమయంలో ఆయన పార్టీ తరపున రాజోలు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. జనసేన పార్టీకి నికరంగా ఆరు శాతం ఓట్లు ఉన్నట్లుగా 2019 ఎన్నికలతో తేలింది. ప్రజారాజ్యంతో పోలిస్తే ఈ ఓటు శాతం చాలా తక్కువ. అయితే పవన్ కల్యాణ్ పోరాటయోధుడు. ఓట్లు, సీట్లు రాలేదని ఆయన నిరాశపడలేదు. రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయన ఓ పొలిటికల్ ఫోర్స్‌గా మారారా అంటే చెప్పలేని పరిస్థితి. తనకు అండగా ఉండే సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్ల జనసేన భారీగా ఓట్లు చీలుస్తోంది. కానీ గెలిచేంత వరకూ రావడం లేదు. అక్కడే జనసేన వైఫల్యం చెందింది.
2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ
పార్టీ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా.. జనసేనకు పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవడం పెద్ద మైనస్. పార్టీ కోసం అయినా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికైనా పవన్ సినిమాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం పెరిగిపోయింది. ఎప్పుడో ఓ సారి సమావేశం పెట్టడం.. లేకపోతే డిజిటల్ క్యాంపెన్ నిర్వహించడంతో సరిపోతోంది. ప్రజా పోరాటాలు పరిమితంగా ఉన్నాయి. అయితే ఆయనపైనా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది. ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు. అయినా పవన్ మాత్రం గీత దాటలేదు. రాజకీయంగానే తేల్చుకుంటానని.. వైఎస్ఆర్‌సీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు.
బలాన్ని గుర్తించి.. ఆ బలంతోనే గెలిచే ప్రయత్నం చేయాలి !
పవన్ కల్యాణ్ రాజకీయంగా విశాలమైన దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది. ఉన్న బలాన్నే పక్కాగా వాడుకునే ప్రయత్నం చేయాలన్నది రాజకీయ నిపుణుల అంచనా. అదే సమయంలో ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించాలంటే.. ఎక్కువగా ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఏదైనా సభ నిర్వహిస్తే తర్వాత రెండు వారాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించరు. గత మూడేళ్లుగా ఇదే జరగడం వల్ల ఆయన అందుబాటులో ఉంటారన్న నమ్మకం ప్రజలకు కలగడం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. దసరా నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఎన్నికల వరకూ ఆయన జనంలోనే ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రాజకీయంగానూ ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
పవన్ కల్యాణ్ ఘోర పరాజయంతోనే సినీ కెరీర్ ప్రారంభించారు. కానీ ఇప్పుడాయన సూపర్ స్టార్‌గా ఉన్నారు. రాజకీయాలలోనూ ఆయన అలాగే అవుతారని జనసైనికులు నమ్మకంతో ఉన్నారు.