KCR National Politics : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఒక్క అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్.. ధర్డ్ ఫ్రంట్.. బీఆర్ఎస్ అంటూ ఆయన చేస్తున్న రాజకీయ ప్రయోగాలు... ప్రారంభదశలోనే నిర్వీర్యమవుతున్నాయి. అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ప్లాన్లు ఎక్కడ ఫెయిలవుతున్నాయి ? ఒకే కూటమిగా ప్రాంతీయ పార్టీలను మార్చడంలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు ? కేసీఆర్ సామర్థ్యంపై ఇతర పార్టీల నేతలకు నమ్మకం కలగడం లేదా? లేక ప్రధాన పదవిపై ఎక్కువ మంది ఆసలు పెట్టుకోవడమే కారణమా ?
ఫెడరల్ ఫ్రంట్ కోసం 2017 నుంచే ప్రయత్నాలు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సీఎం అయిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆలోచనలు చేశారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో విపక్ష పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత ఆయన దృష్టి జాతీయ రాజకీయాలపై పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ కూటమిని తీసుకు రావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లక ముందే ఆయన రాష్ట్రాల పర్యటనలు ప్రారంభమయ్ాయయి. అయితే అప్పట్లో ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండంటం వల్ల.. కాంగ్రెస్ మిత్రపక్షాలనే అత్యధికంగా కలవడం వల్ల బీజేపీ కోసం ఆయన మూడో ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువ వినిపించింది. దీంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ ఒరిస్సా సహా పలు రాష్ట్రాల్లో పర్యటించారు.
2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందే కూటమి కట్టే ప్రయత్నాలు విఫలం !
2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. కేంద్రాన్ని శాసించే రీతిలో సీట్లు సాధించి ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి కింగ్ మేకర్ అవ్వాలనుకున్నారు. అందుకే నవీన్ పట్నాయక్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ వటి రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ ఎన్నికలకు ముందు కూటమి సాధ్యం కాలేదు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నారు. ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేశారు. అయితే చంద్రబాబుతో కలిసే ఉద్దేశం లేని కేసీఆర్.. సైలెంట్ అయ్యారు.ఏపీలో జగన్.. తెలంగాణలో తాము అత్యధిక సీట్లు సాధిస్తే కింగ్ మేకర్లం కావొచ్చనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయి. దాంతో కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి.
2024లో గోల్ కొట్టాలన్న లక్ష్యంతో కేసీఆర్ !
రెండు సార్లు ప్రయత్నాలు విఫలమైనా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. మూడో సారి రాజకీయ పరిస్థితులు మరింత టఫ్‌గా మారాయి. ప్రాంతీయ పార్టీలు కుంచించుకుపోయాయి. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి .. సిద్ధంగా లేవు.. ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందామన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే తన లక్ష్యాన్ని అలా వదిలేసుకుంటే కేసీఆర్ ఎందుకు అవుతారు. నేరుగా సొంత జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారు. రైతులదర్నీ ఏకతాటిపైకి తీసుకు వస్తే.. తెలంగాణ ఉద్యమం తరహాలో అందర్నీ ఏకం చేస్తే.. అనుకున్నది సాధించినట్లవుతుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీపై దృష్టి పెట్టారు. అయితే ఇదే సమయంలో కలసి వచ్చేపార్టీలతో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ప్రతిబంధకంగా అత్యధిక మంది ఆశావహులు !
ఢిల్లీని గురిపెట్టిన ప్రాంతీయ పార్టీ నేతల్లో ఉన్నది కేసీఆర్ ఒక్కరే కాదు.ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ప్రతీ చోటా ఓ బలమైన నేత ఢిల్లీపై గురి పెట్టారు. వాళ్లందరూ కేసీఆర్ నేతృత్వంలో నడవలేరు. అది సాధ్యం కాదు. నితీష్, మమతా బెనర్జీ, శరద్ పవార్ ఇలా చాలా మంది నేతలు తామంటే తాము ఉన్నామని అంటున్నారు. వీరంతా కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం లేదు. ఇది కూడా కేసీఆర్ కూటమి ప్రయత్నాలు విఫలమవడానికి మరో కారణం.
అంతిమంగా కేసీఆర్ కుంభస్థలానికే గురి పెడుతున్నారు. తెలంగాణ సాధించగా లేనిది... ఢిల్లీ కోటను బద్దలు కొట్టలేమా అని ఆయన కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. కానీ ముందు ముందు అనుకూల పలితాలు వస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు.